కరోనా రెండో దశలో పాజిటివ్ బారినపడిన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగానూ చితికిపోతున్నాయి. కుటుంబంలో ఒకరికి సోకిన వైరస్ అనంతరం కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో కొందరు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. అక్కడ వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. లక్షల ఖర్చు పెట్టినా చివరికి మృత్యువాత పడుతుండటంతో అంత్యక్రియలకు కూడా మిగతా కుటుంబ సభ్యులు నగదు చెల్లించలేక మృతదేహాలను అనాథ శవాలుగా వదిలేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట గ్రామీణ మండలం వినుకొండలో పరిస్థితులు దయనీయంగా మారాయి.
భారమవుతున్న చికిత్స
కరోనా బాధితులు తీవ్రత తక్కువగా ఉంటే హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, తీవ్రత ఎక్కువైన వారు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల సలహాలతో కొవిడ్‌కు మందులు వాడుతున్న వారికి నెగిటివ్ వచ్చేవరకు ర్యాపిడ్ పరీక్ష, మందుల కిట్టు, పల్స్ ఆక్సీమీటర్, స్టీమర్, నెబులైజర్, శానిటైజర్, గ్లౌజులు, మాస్కులు, సిటీస్కాన్, రక్త పరీక్షలు, పౌష్టికాహారం ఇలా అన్ని కలిపి రూ.35 నుంచి రూ.40వేల వరకు ఖర్చు అవుతోంది. ఇక పరిస్థితి విషమిస్తే ఆసుపత్రిలో చేరితే ఒక్కరికి సరాసరి రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగానూ కుదేలవుతున్నాయి. పేద మధ్యతరగతి వారు అయితే అప్పుల ఊబిలోకి వెళుతున్నారు.
కట్టడి చేయాలి.. బాధ్యతగా ఉండాలి
మొదటి దశ కరోనా వ్యాప్తికి, రెండోదశకు స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. గతంలో కుటుంబంలో ఒకరికి పాజిటివ్ తేలితే వారిని అప్పటికప్పుడు కట్టడి చేసేవారు. దాంతో వైరస్ వ్యాప్తి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, గుంటూరు, తెనాలి, వినుకొండ, మాచర్ల తదితర ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులలో అవసరమైన బెడ్లు కరోనా రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ ద్వారా 50శాతం బెడ్‌లు కేటాయించిన అన్ని ఆసుపత్రులలో వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆక్సిజన్, రెమ్‌డెసివర్ కొరత లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు టీకాలు త్వరితగతిన ఎక్కువమందికి వేసేలా చూడాలి. ప్రభుత్వ బాధ్యత అలా ఉండగా ప్రజలు కూడా అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. ఒకవేళ వచ్చినా సురక్షితమైన మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
*యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి, అతని భార్య కు కరోనా పాజిటివ్ రావడంతో గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. భర్త ఆసుపత్రిలో మృతి చెందగా భార్య కోలుకుంది. అప్పటికే రూ.2లక్షల బిల్లు ఆసుపత్రికి చెల్లించారు. ఇంకా మరో రూ.5లక్షలు కట్టాలని లేకపోతే మృతదేహాన్ని ఇవ్వమని ఆసుపత్రి వారు బాధిత కుటుంబానికి తెలిపారు. కుటుంబ పెద్ద మృతి చెంది విషాదంలో ఉన్న వారికి మరో రూ.5లక్షలు చెల్లించడం పెనుభారమైంది.
*చిలకలూరిపేట మండలం గంగన్నపాలేనికి చెందిన ఓ యువకుడి అక్కా, బావ గుంటూరులో ఉంటారు. కరోనాతో బాధపడుతున్న బావ, అత్త, మామలు కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో వ్యయ ప్రయాసలకు ఓర్చి చికిత్సకు చేరారు. రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు బయట తెచ్చుకోవాలని సదరు యువకుడికి వారు సూచించారు. ముగ్గురికి రూ.2లక్షలకు పైగా నగదు చెల్లించి ఇంజక్షన్లు కొనుగోలు చేసి ఆసుపత్రిలో ఇచ్చాడు. పొలం పనులు చేసుకుని బతికే అతను ఇప్పటికే బంధుత్వాల కోసం రూ.6లక్షలు అప్పుచేసి తెచ్చాడు. అవసరమైతే పొలం అమ్ముతానని, ముగ్గురు బతికితే చాలని దేవుడిని ప్రార్థిస్తున్నాడు.