సెప్టెంబరు నెలలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ కంపెనీకి చెందిన పురుగుల మందుకు నకిలీలు తయారుచేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపగా సున్నా శాతం రసాయనం ఉన్నట్లు నివేదిక వచ్చింది. అంటే ఈ మందు పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో ఇదే మందు డబ్బాలు నకిలీవి బుధవారం పట్టుబడ్డాయి. దీంతోపాటు మరో కంపెనీకి చెందిన నకిలీ పురుగుమందు డబ్బాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ ఎక్కువగా జిల్లాలో పత్తి పంటకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో రూ.కోట్ల విలువైన క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. వరుసగా నకిలీ పురుగుమందులు పట్టుబడుతుండటంతో వ్యవసాయశాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా వేయడంతో అక్రమార్కుల గుట్టు వెలుగులోకి వస్తోంది.
ప్రముఖ కంపెనీలను పోలిన డబ్బాలు
జిల్లాలో ఎక్కువగా విక్రయం జరుగుతున్న పురుగుమందులను గుర్తించిన కొందరు అక్రమార్కులు వాటికే నకిలీలు తయారు చేసి మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీ డబ్బాను పోలిన విధంగానే ఎక్కడా చిన్న తేడా కూడా లేకుండా నకిలీలు తయారు చేస్తున్నారు. అసలు, నకిలీ.. పక్కపక్కనే పెట్టి చూసినా గుర్తించలేని విధంగా తయారుచేశారు. కంపెనీ తయారుచేసిన డబ్బాపై స్క్రాచ్‌ను తుడి చేస్తే నంబర్లు కనిపిస్తాయి. నకిలీ డబ్బాపై స్క్రాచ్ సైతం ముద్రించినా దానిని తుడిచివేయడానికి వీలుకావడం లేదు. ఇది మాత్రమే అసలు, నకిలీది గుర్తించడానికి అవకాశముంది. రెండు డబ్బాలు ఒకే రకంగా ఉండటంతో రైతులు గుర్తించే పరిస్థితి లేదు. రసాయనం పిచికారీ చేసినా పని చేయకపోవడం రైతులకు ఆర్థికంగా నష్టజరగడంతోపాటు పైరుకు నష్టం వాటిల్లుతోంది.
తీగ లాగితే కదిలిన డొంక
ప్రత్తిపాడు మండలంలో ట్రేసర్ నకిలీ పురుగుమందు పట్టుబడటంతో యంత్రాంగం అప్రమత్తమై నిఘా పెట్టింది. ఈక్రమంలో డెలిగేట్ పురుగుమందుకు నకిలీది మార్కెట్‌లోకి వచ్చినట్లు గుర్తించారు. అమరావతి మండలంలో ఇది విక్రయించిన డీలరును గుర్తించి సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తికి విజయవాడకు చెందినవారు సరఫరా చేసినట్లు తేలడంతో అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి సప్లయి చేసినట్లు తేలడంతో అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.