Fake Lawyers: గుంటూరు జిల్లాలో పలువురు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది.
నకిలీ లాయర్ల అరెస్ట్: నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్లో పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఇద్దర్ని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఒకరిని, ఆదివారం మరొకరిని అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మొత్తం 15 మంది నకిలీలను బార్ కౌన్సిల్ గుర్తించగా వారిలో ఎనిమిది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయవాదిగా పేరును ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఏడుగురుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 11న తుళ్లూరు పోలీసులకు బార్ కౌన్సిల్ కార్యదర్శి బి. పద్మలత ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు ఇద్దర్ని అరెస్టు చేశామని మిగిలిన వారు పోన్లు స్విచాఫ్ చేసుకుని పరారీలో ఉన్నారని వారినీ త్వరలోనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు తెలిపారు. వీరి అరెస్టు విషయాన్ని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టుకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.