ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ అవసరాల కోసం.. ఫేక్​ కరెన్సీ నోట్ల తయారీ.. కట్​చేస్తే..! - Fake Currency Gang Arrested

Fake Currency Gang Arrested in Hyderabad : కుటుంబ అవసరాల కోసం నకిలీ నోట్లను తయారుచేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. వారి వద్ద నుంచి లక్షలు విలువు చేసే నకిలీ నోట్లు, ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Fake Currency Gang Arrested
Fake Currency Gang Arrested

By

Published : Feb 21, 2023, 1:58 PM IST

Fake Currency Gang Arrested in Hyderabad : నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కొద్దిమంది కష్టపడితే.. మరికొద్దిమంది మాత్రం అడ్డదారులు తొక్కుతారు. ఆ కోవకు చెందిన వారే ఈ అన్నాచెల్లెళ్లు. అంతకుముందే నకిలీ నోట్ల తయారు కేసులో జైలుకు వెళ్లినా.. వారి బుద్ధి మారలేదు. రెండోసారి తమ దందాను పెద్ద ఎత్తున కొనసాగించారు. అయితే విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా వీరి ఆట కట్టించి.. చిప్పకూడు తినిపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూరి రమేశ్‌ బాబు, రామేశ్వరిలు అన్నాచెల్లెళ్లు. మహారాష్ట్రకు చెందిన వీరిద్దరు ఉపాధి పనుల నిమిత్తం తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి వచ్చారు. రామేశ్వరి నగరంలోని ఓ వైద్య కళాశాలలో చదువుకుంటుండగా.. సోదరుడు రమేశ్‌ బాబు అదే ప్రదేశానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని బండ్లగూడ జాగీర్‌లో మెకానిక్‌ షెడ్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొవిడ్​ మహమ్మారి కారణంగా మెకానికి షెడ్డు నడవకపోవడంతో డ్రైవర్‌గా మారాడు. అయితే కుటంబ పోషణ భారమై.. అవసరాలకు డబ్బులు సరిపోకపోవడంతో అడ్డదారిలో సంపాదించాలనుకున్నాడు.

అందుకు చెల్లితో కలిసి నకిలీ నోట్ల తయారీ దందాను ఎంచుకున్నాడు. యూట్యూబ్​లో చూసి దొంగ నోట్లు ఎలా తయారీ చేయాలో నేర్చుకున్నాడు. అందుకు అవసరమైన సామగ్రిని దేశ రాజధాని దిల్లీ నుంచి తీసుకొచ్చి.. రూ.100, రూ.200, రూ.500 నోట్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలో..2022 సెప్టెంబర్‌లో అనుకోకుండా పోలీసులకు చిక్కాడు. చెల్లి రామేశ్వరి తప్పించుకుని.. ముందుగానే బెయిల్‌ పొందింది.

అన్న జైలుకి.. చెల్లి ఫీల్డ్‌కి..: అయితే రమేశ్‌బాబు కారాగారంలో ఉండగా ఫలక్‌నుమాకు చెందిన హసన్‌బిన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి వచ్చాక వారిద్దరు మళ్లీ నకిలీ నోట్ల దందా ప్రారంభించారు. రమేశ్‌ బాబు తన నివాసాన్ని తాండూరుకు మార్చి భారీగా రూ.500 నోట్ల తయారీకి తెరలేపాడు. హసన్​, రమేశ్​బాబు కలిసి తెలంగాణ, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, దిల్లీల్లో ఏజెంట్లను నియమించుకుని మరీ నోట్లు చలామణి చేయడం ప్రారంభించారు. అయితే ఈ కేసులో గతనెలలోనే రమేశ్‌బాబును గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అన్న అరెస్ట్‌ కావడంతో చెల్లి రంగంలోకి దిగింది. రామేశ్వరి తన మకాన్ని చాంద్రాయణగుట్టకు మార్చింది. హసన్‌బిన్‌తో కలిసి నకిలీ నోట్ల చలామణికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారీ కమీషన్‌ ఆశ చూపి ఏజెంట్లతో మళ్లీ దందా మొదలుపెట్టింది. విషయం తెలియడంతో రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ సంయుక్తంగా నిందితులిద్దరినీ సోమవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.27 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు, ఒక ల్యాప్‌టాప్‌, నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details