ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాడు'పై మంత్రి కన్నబాబు ఆరోపణలు...వాస్తవాలు ఏంటంటే..!

మంత్రి కన్నబాబు గురువారం ‘ఈనాడు’ పత్రికలో వచ్చిన మూడు కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. ‘అమ్మబోతే అడవి’ శీర్షికతో వచ్చిన రెండు కథనాలు, రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిపై ‘2 జిల్లాల్లో ఉద్ధృతి’ పేరుతో ప్రచురించిన కథనాలు... అసత్యాలని ఆయన గురువారం విజయవాడలో ఆరోపించారు. అయితే మంత్రి 'ఈనాడు'పై చేసిన ఆరోపణలు ఏంటి? అసలు వార్తల్లోని వాస్తవాలు ఏంటో ఓసారి చూద్దాం.

మంత్రి ఆరోపణలు అవాస్తవం
మంత్రి ఆరోపణలు అవాస్తవం

By

Published : Apr 24, 2020, 3:03 PM IST

Updated : Apr 24, 2020, 4:58 PM IST

ఆరోపణ 1
కన్నబాబు:గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన బొల్లా వీరాంజనేయులు అనే రైతు 12 ఎకరాలు కౌలుకి తీసుకుని పుచ్చకాయల పంట వేసి, కొనేవాళ్లు లేక పొలంలోనే వదిలేశారని ‘ఈనాడు’లో రాస్తూ, తర్బూజా కాయల ఫొటో వేశారు. అధికారులు ఆ రైతుతో మాట్లాడగా.. ఇప్పటికే రెండు కోతలు జరిగాయని, గిట్టుబాటు ధర వచ్చిందని చెప్పారు. లాక్‌డౌన్‌తో కూలీలు దొరక్కపోవడం, నాణ్యత సమస్యల వల్ల పొలంలోనే వదిలేశామని చెప్పారు. అదీ నిన్న మొన్న తీసిన ఫొటో కాదు.

వాస్తవం:బొల్లా వీరాంజనేయులు వేసింది పుచ్చకాయ(వాటర్‌ మిలన్‌) పంటే. ఇప్పటికీ ఆ కాయలు పొలంలోనే ఉన్నాయి. రైతు.. 130-140 టన్నులు విక్రయించగా.. కొనేవారు లేక మరో 70-80 టన్నులు పొలంలో ఉండిపోయాయి. వాటి బరువు ఒక్కొక్కటి 7 నుంచి 12 కిలోలు ఉంటుంది. నాణ్యత, సైజు సమస్యల్లేవు. ఈ విషయాన్ని ఆ రైతే గురువారం ‘ఈనాడు’ విలేకరికి మరోసారి స్పష్టం చేశారు. వాస్తవానికి పొలంలోనివి పుచ్చకాయలే. అధికారులే వాటిన తర్బూజా (మస్క్‌ మిలన్‌)గా పొరబడి నివేదిక ఇచ్చారు.

మంత్రి కన్నబాబు ఆరోపణలు..వాస్తవాలు

ఆరోపణ 2
కన్నబాబు:కేదారేశ్వరపేట రైతుబజారులో అరటి మగ్గిపోతోందని, కొనేవాళ్లు లేరని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ‘ఈనాడు’లో రాశారు. ప్రచురించిన ఫొటో ఎప్పుడో ఈ నెల 14న కడప, అనంతపురం మార్కెట్ల నుంచి అరటి గెలలు ఇక్కడికి తెచ్చినప్పుడు తీసింది.

వాస్తవం: ఈ ఫొటో ఈ నెల 22న ఉదయం 8.32 గంటలకు కేదారేశ్వరపేట రైతుబజారులో ఈనాడు ఫొటోగ్రాఫర్‌ తీశారు. డిజిటల్‌ కెమెరాలో ఫొటోలకు తీసిన తేదీ, సమయం కచ్చితంగా నమోదవుతాయి. ఆ అరటి పళ్లు ఎక్కడ అమ్ముతున్నారో ప్రజలకు సమాచారం తెలియకపోవడంతో అవి కుళ్లిపోతున్నాయనే ‘ఈనాడు’ రాసింది.

తాజా ఫోటో

ఆరోపణ 3
కన్నబాబు: కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి ప్రభుత్వ బులెటిన్‌లో పేర్కొన్న సంఖ్య కంటే, ‘ఈనాడు’లో ఎక్కువ సంఖ్య వేశారు. దాని వెనుక ఏ ప్రయోజనం ఉంది?

వాస్తవం: కరోనా కేసులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల రోజూ ఒకే బులెటిన్‌, అదీ ఉదయం 10 గంటలకు ఇస్తోంది. ఆ తర్వాత సాయంత్రానికి తాజా సమాచారాన్ని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు ప్రకటిస్తున్నారు. పాఠకులకు తాజా సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో.... ప్రభుత్వ బులెటిన్‌కు, జిల్లా అధికారులు ఇచ్చిన వివరాల్నీ జోడించి ‘ఈనాడు’లో ఇస్తున్నాం. ఉదాహరణకు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్‌లో ప్రకాశం జిల్లాలో కేసులు మొత్తం 48 అని ప్రకటించారు. కానీ సాయంత్రం ఐదు గంటలకు జిల్లా యంత్రాంగం విడుదల చేసిన బులెటిన్‌లో 49 కేసులని పేర్కొన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ నెల 22న ఇచ్చిన రాష్ట్ర బులెటిన్‌లో 26 కేసులు అని పేర్కొనగా.. అదే రోజు సాయంత్రం జిల్లా యంత్రాంగం 6 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. దీంతో మొత్తం 32 కేసులయ్యాయి.

ఇదీచదవండి

'మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా పంట ఉత్పత్తుల సమాచారం'

Last Updated : Apr 24, 2020, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details