ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపా దౌర్జన్యాన్ని నిరసిస్తూ... తెదేపా ఆందోళన చేపట్టింది. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల ఎదుటే దాడులు జరుగుతున్నా... నామపత్రాలు చించివేస్తున్నా చూస్తూ ఉన్నారని మండిపడ్డారు. పలుచోట్ల వైకాపా శ్రేణులతో చేతులు కలిపారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ... చంద్రబాబు ర్యాలీగా తరలివెళ్లి డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

Faction in Guntur district over local body elections
పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

By

Published : Mar 12, 2020, 5:50 AM IST

పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా నేతల దాడి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుని... మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నను చంద్రబాబు పరామర్శించారు. వారి గాయాలను పరిశీలించారు. దెబ్బతిన్న వాహనాలను పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్‌ నుంచి డీజీపీ కార్యాలయం వరకూ పాదయాత్ర చేపట్టారు.

దాడిలో గాయపడ్డ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యకర్తలు పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్నారు. దాడిలో దెబ్బతిన్న వాహనాలను ప్రదర్శనగా డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి ప్రధాన గేట్లు మూసివేసి ఉండటంతో చంద్రబాబు సహా నేతలందరూ రోడ్డుపై బైఠాయించారు. శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అక్కడకు వచ్చి చర్చలు జరిపారు.

ఈ ఘటనకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన సూత్రధారి అని తెదేపా నేతలు ఆరోపించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అదనపు డీజీ హామీ ఇవ్వటంతో నేతలు ఆందోళన విరమించారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు.

తమ పర్యటన గురించి పోలీసులకు తప్ప ఇంకెవరికీ తెలియదని బొండా ఉమ పేర్కొన్నారు. వారే వైకాపా శ్రేణులకు సమాచారమిచ్చారని ఆరోపించారు. కారంపూడి నుంచే తమను వెంబడించడం మొదలు పెట్టారని వివరించారు. తెదేపా నేతలపై దాడిని జాతీయ బీసీ సంఘం ఖండించింది. 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయాలని... లేదా ఘటనపై సీఎం జగన్‌ సమాధానమివ్వాలని డిమాండ్‌ చేసింది.

మాచర్లలో తెలుగుదేశం నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు రేంజ్‌ ఐజీ ప్రభాకరరావు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభాకరరావు కోరారు.

ఇదీ చదవండీ... పంచాయతీ మంత్రి ఇలాఖాలో ప్రజాస్వామ్యం అపహాస్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details