భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు మనం అనుసరిస్తున్న విదేశాంగ విధానాల్లో వచ్చిన మార్పులతో పాటు కరోనా కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతం లడఖ్‌లో భారత్ నిర్మిస్తోన్న రహదారి కారణంగానే... చైనా మనతో కాలుదువ్వడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. వివాదాస్పద స్థలంలో రోడ్లు ఎలా నిర్మిస్తారని చైనా ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు చైనా దీనిపై ఈ స్థాయిలో స్పందించటానికి కారణాలు మాత్రం అనేకం ఉన్నాయని నిపుణలు వివరిస్తున్నారు.
మన జాతీయ ప్రయోజనాల కోసం భారత్ అమెరికాకు అనుకూలంగా ఉంటోంది. ఇది చైనాకు ఆగ్రహం తెప్పిస్తోంది. మనం గతంలో అలీన విధానం పాటించేవాళ్లం. ఏ అగ్రరాజ్యానికి అనుకూలంగా ఉండబోమని చెప్పాం. కానీ ఇపుడు అమెరికాకు దగ్గరవుతుండటం తమ జాతీయ భద్రతకు ప్రమాదమని చైనా భావిస్తోందని విశ్లేషిస్తున్నారు. జీ7 దేశాల్లోకి భారత్‌కు ఆహ్వానం పంపిన అమెరికా... చైనాను మాత్రం విస్మరించింది. ఇది కూడా చైనా అగ్రహానికి మరో కారణం. ఇటీవల కాలంలో యు.ఎస్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి క్వాడ్ అనే సమూహంగా ఏర్పడ్డాయి. ఈ క్వాడ్ తరపున చైనాకు వ్యతిరేక ప్రకటనలు వెలువడుతుండటం కూడా డ్రాగన్ దేశానికి కోపం తెప్పించిందని నిపుణులు భావిస్తున్నారు.