పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గోదావరి నదిని ప్రస్తుత ప్రవాహ మార్గం నుంచి మళ్లించాల్సిన నేపథ్యంలో ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు దృష్టి సారించారు. ఈ సీజన్లో స్పిల్ వే నిర్మాణం పూర్తిచేసి గోదావరి వరదను స్పిల్ వే, స్పిల్ ఛానల్ వైపు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం వద్ద ఉన్న భూ భౌతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నది పక్కన రాతి ప్రాంతంలో స్పిల్ వే నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎగువ నుంచి గోదావరి మళ్లింపునకు వీలుగా అప్రోచ్ ఛానల్ తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో గోదావరి వరద స్పిల్ వే వద్దకు వచ్చే క్రమంలో ఎంత వేగం ఉంటుంది? ఆ ప్రభావం స్పిల్ వే వద్ద ఎలా ఉంటుంది? ఇబ్బందులు లేకుండా స్పిల్ వే వద్ద వరదను దాటించేందుకు వీలుగా అప్రోచ్ ఛానల్ ఏ మేరకు తవ్వాలి? ఈ మళ్లింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటనే అంశాలపై అధ్యయనాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. పుణెలో ఉన్న కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు నమూనాను రూపొందించారు. అది ఒక చిన్నతరహా ప్రాజెక్టు నిర్మాణ శైలిలో ఉంటుంది. అక్కడ నీటిని ప్రవహింపజేసి దాని ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ మేరకు ఈ ప్రాజెక్టు వద్ద చేయాల్సిన మార్పులను ఖరారు చేస్తారు.
అప్రోచ్ ఛానల్ వెడల్పు పెంపు?
ప్రస్తుతం గోదావరి నదిని మళ్లించేందుకు తవ్వనున్న అప్రోచ్ ఛానల్ అంశాన్ని తుది రూపునకు తీసుకువస్తున్నారు. ఇంతకుముందు అనుకున్న ఆకృతుల ప్రకారం గోదావరి వరద స్పిల్ వే వద్దకు వచ్చే క్రమంలో సుడిగుండాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. పైగా స్పిల్ వేలో కొన్ని గేట్లవైపు ప్రవాహం ఎక్కువగా ఉంటుందని గమనించారు. దీంతో రెండు రకాల నమూనాలను తీసుకుని పుణెలో అధ్యయనం చేశారు. నదిని మళ్లించే అప్రోచ్ ఛానల్ మొదట్లో 200-350 మీటర్ల వరకు వెడల్పు ఉంటే సరిపోతుందని భావించారు. ఆ లెక్కల ప్రకారం చేసిన అధ్యయనం సంతృప్తి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు అప్రోచ్ ఛానల్ 600-660 మీటర్ల వరకు వెడల్పు పెంచాలని అధ్యయనాల్లో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఎడమ వైపు 500 మీటర్ల పొడవున గైడ్‌వాల్ నిర్మించాల్సి ఉందని భావిస్తున్నారు. త్వరలోనే వీటి ఆకృతులు ఖరారు చేసి పనులను ప్రారంభించనున్నారు. వచ్చే వరద సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.