ధరణి పోర్టల్ అమలు, ఆ తర్వాత వచ్చిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిషేధిత జాబితాలో పొరపాటుగా, తప్పుగా చేరిన భూముల విషయమై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకుపైగా ఈ తరహా భూముల కేసులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. కంప్యూటర్ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ - కార్డ్ విధానం అమల్లో ఉన్నప్పటి జాబితాను, ప్రస్తుతం ధరణిలో ఉన్న జాబితాతో సరిపోలుస్తున్నారు.
పొరపాటుగా, తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగించే ప్రక్రియను రెవెన్యూశాఖ కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లోని భూపరిపాలనాశాఖ ప్రధాన కమిషనర్ - సీసీఎల్ఏ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. రోజుకు కొన్ని జిల్లాల చొప్పున కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను పిలిపించి వారి పరిధిలోని భూములకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు.
నిషేధిత భూములకు సంబంధించి కార్డు విధానంలోని వివరాలు, ప్రస్తుతం ధరణిలోని వివరాలను సరిచూస్తున్నారు. రెండింటింలోనూ తప్పుగా, పొరపాటున నమోదైన వాటిని ఒక్కో కేసు వారీగా పరిశీలిస్తున్నారు. ఆ భూమిని ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చాల్సి వచ్చిందో పరిశీలిస్తున్నారు. విడివిడిగా కాకుండా ఉమ్మడిగా కేసుల పరిష్కరిస్తున్నారు. మొదటి దశలో సీసీఎల్ఏ కార్యాలయంలో నిషేధిత జాబితాను పరిశీలించి పరిష్కారానికి తగిన మార్గనిర్ధేశం చేస్తున్నారు.
రెండో దశలో జిల్లా కలెక్టరేటర్ కార్యాలయంలో ప్రక్రియను పూర్తి చేసే కసరత్తు కొనసాగిస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో వేటిని కొనసాగించాలి, వేటిని తొలగించాలన్న విషయమై కలెక్టర్లు, తహసీల్దార్లకు రెవెన్యూశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల భూముల విషయంలో ఎక్కడైనా స్టే ఉంటే వాటిని నిషేధిత జాబితాలో కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేకుండా పెండింగ్ లో ఉన్నా, ఈ-కోర్టు వెబ్ సైట్‌లో కేసు రికార్డులు లేకపోయినా తొలగించాలని తెలిపారు. ఆర్ఓఆర్ కలెక్షన్స్‌కు చెందిన భూములను జాబితా నుంచి తీసివేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అభ్యంతరం ఉన్న వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూముల విషయంలో సంబంధిత శాఖాధిపతి నుంచి మెమో, గెజిట్ లేదా లేఖ తీసుకొని నిషేధిత జాబితాలో కొనసాగించాలని చెప్పారు.