ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల హల్​చల్.. ఒకరిపై దాడి - గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వీరంగం

మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించి ఒక వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. లింగంగుంట్ల గ్రామానికి చెందిన గంటా మోహనరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

excise constables are in alcohol intoxication and attacked on a person at narsaraopeta in guntur district
మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల హల్​చల్.. ఒకరిపై దాడి

By

Published : Feb 5, 2021, 7:46 AM IST

మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల హల్​చల్.. ఒకరిపై దాడి

మద్యం మత్తులో ఉన్న ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు వారితో ఉన్న మరో ఇద్దరు.. బుధవారం వీరంగం సృష్టించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేషన్‌ రోడ్డులో గల ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదుట అకారణంగా ఒక వ్యక్తిని చితకబాదారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించిన అతడిని రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆ డివైడర్​కేసి కొట్టడంతో అతనికి తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు సత్యం, రాజశేఖరరెడ్డి, వీఆర్‌లో ఉన్న అశోక్, ప్రభుత్వ మద్యం దుకాణంలో తొలగించిన సూపర్‌వైజరు ప్రశాంత్‌... మద్యం తాగేందుకు స్టేషన్‌రోడ్డులోని ఓ బార్‌ కు వెళ్లారు. వీరంతా కలిసి మద్యం తాగుతుండగా ఫోన్‌ రావడంతో రాజశేఖర్‌రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్లు మద్యం తాగి పార్కింగ్‌ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గంటా మోహనరావు అనే వ్యక్తి ద్విచక్రవాహనం అక్కడ నిలిపాడు. మా వాహనాల వద్ద బండి పెడతావా అంటూ మోహనరావును ఎక్సైజ్‌ పోలీసులు దుర్భాషలాడి.. అతనిపై దాడికి దిగారు.

సమీపంలో ఉన్నవారు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని చంపుతామని బెదిరించారు. మోహనరావు సృహతప్పి పడిపోవటం గుర్తించిన బార్‌ యాజమాన్యం అతడిని ఆసుపత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న సీఐ ప్రభాకర్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహనరావుతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు సత్యం, అశోక్, డ్రైవర్‌ వెంకట్రావు, ప్రశాంత్‌లపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

షటిల్‌ ఆడుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ... యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details