గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇష్టారాజ్యంగా హత్యారాజకీయాలకు పాల్పడుతున్నా... పోలీసులు స్పందించటం లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో అసలు దోషుల్ని వదిలేసి... వేరే వాళ్లను అరెస్టు చేశారని ఆరోపించారు. అంకులు హత్య కేసులో రాజకీయ కోణం లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పటాన్ని తప్పుబట్టారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో కోటేశ్వరరావు, కర్పూరపు వెంకట కోటయ్య వైకాపా నాయకులు కాదా అని ప్రశ్నించారు. అప్పిరెడ్డి అనే వైకాపా నేతను పోలీసులు కేసు నుంచి తప్పించారని ఆరోపించారు. దోమతోటి విక్రమ్ అనే తెదేపా దళిత కార్యకర్తని, నీలకంఠబాబు అనే వడ్డెర కులస్తుడిని హత్య చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.