నివర్ తుపాన్ బాధిత రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. బాధిత రైతులను గుర్తించటంలో నిర్లక్ష్యం వహించారన్నారు. రైతులకు ఇవాళ్టి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేంత వరకూ తెదేపా అండగా ఉంటుందని చెప్పారు.
మోటర్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాడు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా... వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.