ముఖ్యమంత్రి మెప్పు కోసం - పూటకో విద్యావిధానం Education system changing day by day in AP:విద్యాశాఖలో ఆయనో కీలక అధికారి. విద్యార్థుల చదువు, వారి సామర్థ్యాలు, అభ్యసన స్థాయిలతో ఆయనకు పని లేదు. సీఎం జగన్ కళ్లలో ఆనందం చూడాలన్నదే ఏకైక కోరిక. సమీక్షా సమావేశాల్లోనూ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావించి, సీఎంకు చెబితే ఆనందపడతారని అంటుంటారు. ఆ విధంగా టోఫెల్, ఐబీ, ఫ్యూచర్ స్కిల్స్ అంటూ చాలా అంశాల్ని అమల్లోకి తెస్తున్నారు. సీఎం కళ్లలో ఆనందం గురించి ఆలోచిస్తున్నారు తప్ప, భిన్నమైన సిలబస్‌లతో విద్యార్థులు గందరగోళానికి గురవుతారనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. మాతృభాష తెలుగుకు సమాధి కట్టేలా ఐచ్ఛికంగా విదేశీ భాషలు తీసుకొచ్చారు.
సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం విద్యాశాఖ కీలక అధికారి అడ్డగోలు విధానాలు అమలు చేస్తున్నారు. ఆయన తీరుతో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులకు కమ్యునికేషన్ స్కిల్స్ కోసమంటూ టోఫెల్ తీసుకొచ్చారు. అసలు ఉద్దేశం మాత్రం, టోఫెల్ పేరిట కోట్లు ఖర్చు చేయడమే. సీఎం సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని గొప్పగా చెప్పేసి పాఠశాల స్థాయిలో టోఫెల్ సర్టిఫికెట్లతో ప్రయోజనమేంటో పట్టించుకోకుండా వెంటనే అమల్లోకి తెచ్చేశారు. ఉద్యోగాలు ఇచ్చేందుకు దేశంలో ఏ సంస్థా టోఫెల్ సర్టిఫికెట్లు అడగదు. మొదట్లో ఈయన మాటలు విని కిందిస్థాయి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారి వ్యవహార శైలి చూసి, అంతర్గత సంభాషణల్లో ఆయన్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా సంబోధిస్తున్నారు. టోఫెల్ బోధన బాధ్యతలు ఆంగ్ల సబ్జెక్టు టీచర్లకే కాకుండా ఇతర సబ్జెక్టుల వారికీ ఇచ్చేశారు. కొన్నిచోట్ల టోఫెల్ బోధనను తెలుగు ఉపాధ్యాయులకూ అప్పగిస్తున్నారు. దీనిపై ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) తో ఒప్పందం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఇచ్చే సమగ్ర శిక్షా అభియాన్ నిధులను వాడేస్తున్నారు.
Minister Botsa ఉపాధ్యాయులపై బొత్సా ఫైర్.. అధికారులపై చర్యలు తీసుకుంటే మీకేంటీ సంబంధం
టోఫెల్ పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే, ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్- ఐబీ అమలు చేస్తామంటూ సీఎం సమీక్షలో ప్రతిపాదించారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు సిద్ధమై, ఆ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చున్నారు. విద్యార్థుల చదువు, సామర్థ్యం, అభ్యసన స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్ర సిలబస్, సీబీఎస్ఈ టోఫెల్, ఐబీ అంటూ విన్యాసాలేంటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. టోఫెల్, ఐబీలపై చర్చలు జరుగుతుండగానే, మరోసారి సీఎం సమీక్షలో 9, 10 తరగతుల విద్యార్థులకు ఐచ్ఛికంగా జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్ లాంటి భాషలు నేర్పిస్తామని ప్రతిపాదించారు. సీబీఎస్ఈ లో భాష ఎంపికకు ఐచ్ఛికాలు ఉంటాయి. రెండో భాషగా విదేశీ భాషలను ఎంపిక చేసుకుంటే తెలుగు బోధన ఉండదు. అంటే మాతృభాషకు సమాధి కట్టినట్లే. ఇప్పటికే సీబీఎస్ఈ లో 5 సబ్జెక్టులు ఉండటంతో హిందీని తొలగించాలని నిర్ణయించారు. బోధనే తప్ప పదో తరగతిలో ఈ సబ్జెక్టు పరీక్ష ఉండదు.
Praveen Prakash Sudden Inspection సెప్టెంబర్ సిలబస్ ను ఇప్పుడు బోధిస్తారా..? టీచర్లు, అధికారుల పనితీరుపై ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం..
ఈ సిలబస్‌లు పూర్తిగా అమలు చేయకుండానే, విద్యార్థి దశ నుంచే వ్యాపార అంశాలపై అవగాహన కల్పించేందుకంటూ 9 నుంచి 12 తరగతులకు "ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం" తెచ్చారు. దీనిపై హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో చర్చిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నాటి సీఎం సమీక్షలో ఆరో తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ శిక్షణంటూ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్, అల్గారిథమ్, డేటా ఎనాలసిస్, ఏఐ ఎథిక్స్- సోషల్ ఇంపాక్ట్స్ బోధిస్తారట. 9, 10 తరగతులకు "ఏఐ టెక్నాలజీ”, మెషీన్ లెర్నింగ్‌పై ప్రాథమిక అవగాహన, అప్లికేషన్స్, అల్గారిథమ్ అండ్ డేటా ఎనాలసిస్, ఏఐ ఎథిక్స్, మ్యాథ్స్-స్టాటస్టిక్స్ నేర్పిస్తామని ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకే పాఠాలు చెప్పేవారు లేక ఆన్‌లైన్‌పై ఆధారపడుతుంటే, పాఠశాల పిల్లలకు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాఠాలు చెప్పించాలని నిర్ణయించారు. ఈ అంశాలపై బీటెక్‌లో పూర్తి పట్టు సాధించలేని విద్యార్థులు, స్కూలు పిల్లలకు ఏం బోధిస్తారన్నది నిపుణుల ప్రశ్న. ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ విధానం అమలు చేస్తూ నెలకు 12వేల ఉపకార వేతనం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. పిల్లలకు బోధిస్తే బీటెక్ విద్యార్థి కెరీర్‌కు ఉపయోగమేంటో ఈ ప్రతిపాదన తెచ్చిన ఉన్నతాధికారికే తెలియాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే బైజూస్ కంటెంట్ అమలు చేస్తున్నారు. మరో వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తెచ్చారు. టోఫెల్‌కు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా ఇన్నిరకాల సబ్జెక్టులు ఉండగా, ఇప్పుడు ఫ్యూచర్ స్కిల్స్ శిక్షణ అంటున్నారు. ఐదో తరగతి విద్యార్థులు చిన్నచిన్న ఇంగ్లిష్ పదాలు చదవలేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి మెప్పు కోసం పూటకో విధానం తీసుకొస్తూ వాస్తవ విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపయోగమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
నేను ఆర్డర్ ఇస్తే అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే రాదు : ప్రవీణ్ ప్రకాశ్