ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైపైకి ఎగబాకుతున్న నిత్యావసరాలు - ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు విలవిల - Essential Commodity Prices in AP

Essential Commodities Prices Hike: జగన్‌ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సగటున 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయి. బియ్యం 32 శాతం, కందిపప్పు 107 శాతం, ఉల్లిపాయలు 287 శాతం పెరిగాయి. అంతే కాదు.. రేట్ల పెరుగుదల జాబితాకు అంతే లేదు. పప్పుధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం వంటి సరకులతో పాటు చిరుధాన్యాలదీ అదేదారి. వీటికితోడు నెలనెలా విద్యుత్తు బిల్లులు, వంటగ్యాస్, పాలు.. ఇతరత్రా బాదుడుతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కరవుతో దిగుబడులు తగ్గి.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Essential_Commodities_Prices_Hike
Essential_Commodities_Prices_Hike

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 9:43 AM IST

Essential Commodities Prices Hike: పైపైకి ఎగబాకుతున్న నిత్యావసరాలు - ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు విలవిల

Essential Commodities Prices Rise: అయిదేళ్ల కిందటితో పోలిస్తే బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరకుల రూపంలోనే నెలకు వెయ్యి నుంచి 15 వందల వరకు అదనంగా ఖర్చవుతోందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వీటికి నెలకు 3 వేలు ఖర్చు చేసిన కుటుంబం ఇప్పుడు 4 వేల 500 వరకు వ్యయం చేయాల్సి వస్తోంది.

ఇలా ఒక్కో ఇంటిపై సగటున నెలకు 12 వందలు వేసుకున్నా.. 54 నెలల జగన్‌ పాలనా కాలంలో సరకుల రూపంలో 65 వేల అదనపు భారం పడింది. ఈ ఏడాది తీవ్ర కరవు పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులూ భారీగా తగ్గనున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Rising Prices of Essentials: చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు.. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.200

బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబరు నుంచి మొదలైన పెరుగుదల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతేడాది జులై వరకు కిలో 50 వరకు ఉన్న సన్నబియ్యం ధర క్రమంగా పెరుగుతూ ఇప్పుడు సగటున 60 దాటింది. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో సన్నబియ్యం ధరలు 65 నుంచి 67 రూపాయలు వరకు పలుకుతున్నాయి. కొన్నిచోట్ల సాధారణ రకం బియ్యమే కిలో 50 కిపైగా అమ్మకం చేస్తున్నారు.

దీంతో నెలకు 25 కిలోలు వినియోగించే కుటుంబంపై 250 రూపాయలకు పైగా భారం పడుతోంది. అంటే ఏడాదికి 3 వేల చొప్పున వంటింటి ఖర్చు పెరిగింది. కరవు పరిస్థితుల కారణంగా.. ఈ ఏడాదీ ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. సాగర్‌ ఆయకట్టులో సన్న రకం ధాన్యం సాగు భారీగా తగ్గింది. దీంతో వాటి ధర మరింత పెరుగుతుందన్న అభిప్రాయం మిల్లర్లలో వ్యక్తమవుతోంది. గోధుమపిండి ధర సైతం కిలో 45 నుంచి 55 రూపాయల వరకు ఎగబాకింది.

Petrol and Diesel Prices in Andhra Pradesh పెట్రోల్​ ధరలపై నాడు గగ్గోలు.. నేడు బాదుడు! పెత్తందారు పాలనలో ఇదో తరహా మోసం..

కందిపప్పు ధరలూ ఈ ఏడాది జనవరి నుంచి ఉడుకుతున్నాయి. గత 11 నెలల్లో కిలోపై సగటున 80కిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో 180 నుంచి 190 మధ్య కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో కిలో 200 పైనే ఉంది. సగటున కుటుంబానికి నెలకు కిలో వినియోగం చొప్పున చూసినా.. ఏడాదికి 1200 రూపాయల భారం పడుతోంది. మినపగుళ్ల ధర కిలో 130 పైగా ఉంది. వేరుశనగ గుళ్లు కిలో 160 నుంచి 180 రూపాయలు పైగా పలుకుతున్నాయి. వేరుశనగ నూనె లీటరు 170 రూపాయల పైనే ఉంది. అనంతపురం జిల్లాలో వేరుశనగ సాగు తగ్గిపోవడంతో పాటు కరవు రీత్యా దిగుబడులు క్షీణించాయి.

ఉల్లి ఉత్పత్తి పడిపోవడంతో ధరలు ఇప్పటికే నింగిన తాకుతున్నాయి. ఎగుమతులపై ఆంక్షలు, నాఫెడ్‌ ద్వారా మార్కెట్లోకి నిల్వలు విడుదల నేపథ్యంలో పెరుగుదల ఆగినా.. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో కిలో 62 నుంచి 70 రూపాయల మధ్య ఉంది. చింతపండు ధర కిలోకు 35 రూపాయల పైనే పెరిగింది. అయిదేళ్ల కిందటితో పోలిస్తే.. పంచదార ధర కిలోకు 7 రూపాయలు, బెల్లం 12 రూపాయల చొప్పున పెరిగాయి.

Increased prices: ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు

ఇటీవల కాలంలో ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో చిరుధాన్యాలు ఎక్కువ వినియోగిస్తున్నారు. వాటి ధరలు చూస్తే భయపెడుతున్నాయి. గతంలో పచ్చజొన్నల ధర కిలో 60 ఉండగా.. ఇప్పుడు 100 నుంచి 110 వరకు పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ పంట దెబ్బతింది. తెల్లజొన్న ధర కూడా కిలో 65 వరకు చేరింది.

కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు కిలో 120 నుంచి 160 రూపాయల మధ్య అమ్ముడవుతున్నాయి. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఇవి కిలోకు 40 నుంచి 60 వరకు పెరిగాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్పితే.. మరేమీ దొరకని దుస్థితి నెలకొంది. కార్డుదారులకు కనీసం కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేయలేక పోతున్నారు. గోధుమపిండి, చిరుధాన్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు.

Price Rise of Essential Commodities: భగ్గుమంటున్న నిత్యావసర ధరలు.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details