రాష్ట్రవిభజన తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటివిడుదల, నియంత్రణ, పర్యవేక్షణ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. సాగర్ కుడికాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి అవసరాలకు నీటిని వాడుకుంటున్నాం. జలాశయం తెలంగాణ పర్యవేక్షణలో ఉన్నందున స్థానిక అవసరాలకు అనుగుణంగా నీటివిడుదలలో కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ క్రమంలో బుగ్గవాగు విస్తరించి సామర్థ్యాన్ని 7టీఎంసీలకు పెంచడం ద్వారా నీటిని నిల్వచేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బుగ్గువాగు విస్తరణ సర్వేకు నిధులు మంజూరు చేసింది. బుగ్గవాగు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సాగర్ కుడికాలువకు కేటాయించిన 132 టీఎంసీలలోనే బుగ్గవాగుకు నీటిని వాడుకుంటున్నందున అపెక్స్ కౌన్సిల్‌లో అనుమతి పొందాల్సిన అవసరం లేదని జలవనరులశాఖ సమాధానం ఇచ్చింది.
బుగ్గవాగు సామర్థ్యం పెంపుతో తాగు, సాగునీటికి భరోసా
నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని బుగ్గవాగు సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి రూ.1.04 కోట్లు విడుదల చేసింది. త్వరలో టెండర్లు పిలిచి సర్వే పనులు ప్రారంభించనున్నారు. నివేదిక ఆధారంగా నీటినిల్వ సామర్థ్యం ఎన్ని టీఎంసీలకు పెంచాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
బుగ్గవాగులో ప్రస్తుతం 1.5టీఎంసీలు డెడ్‌స్టోరేజ్ కాగా 1.7టీఎంసీల నీరు లైవ్‌స్టోరేజ్ ఉంటుంది. జలాశయం లోతు, కట్టల ఎత్తు పెంచి బలోపేతం చేయడం వల్ల సామర్థ్యం పెంచనున్నారు. పూడిక తొలగింపుతోపాటు ప్రస్తుత రిజర్వాయర్‌కు సమీపంలో ఉన్న 200 ఎకరాల భూములను కూడా జలాశయంలో కలిపేయాలన్న యోచనలో ఉన్నారు. అవసరాన్ని బట్టి మరింత భూమిని సేకరించి విస్తరిస్తే కలిగే ప్రయోజనాలపై కూడా సర్వే చేపడతారు. విస్తరణ పూర్తయితే ఏడాది పొడవునా గుంటూరు, ప్రకాశం జిల్లాలో కుడికాలువ పరిధిలోని ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కుడికాలువ ద్వారా వరదనీటిని బుగ్గవాగులో నిల్వచేసుకుంటే అదనంగా 4టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల వృథాగా సముద్రానికి వెళ్లే నీటిని నిల్వచేసుకోవచ్ఛు పంటలకు అత్యవసరంగా తడి అందించాల్సి వచ్చినప్పుడు బుగ్గవాగు నీటిని వినియోగించుకోవచ్ఛు బుగ్గవాగులో బోటింగ్, లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యటకులను ఆకర్షించవచ్ఛు బుగ్గవాగుపై ఆధారపడి వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా తాగునీటి పథకాలు చేపడుతున్నందున విస్తరణ అనివార్యమైంది. ఈవిషయమై లింగంగుంట్ల పర్యవేక్షక ఇంజినీరు పురుషోత్తమగంగరాజు మాట్లాడుతూ కాలువలకు నీటి విడుదల ఆపిన తర్వాత ప్రాజెక్టు సర్వేకు టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామన్నారు.