యువతి నగ్న దృశ్యాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గుంటూరు అర్బన్ దిశ పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని.... తన సహచర విద్యార్థితో ప్రేమలో పడింది. ఒకరోజు ఇద్దరూ ఏకాంత ప్రదేశానికి వెళ్లగా... యువతికి మత్తు మందు ఇచ్చి ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా దీనిని ఫోన్లో చిత్రీకరించాడు. కొన్ని రోజుల తరువాత యువతి అతన్ని దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు యువతి నగ్న దృశ్యాలను తన స్నేహితుడికి పంపాడు.
డబ్బులిస్తే తొలగిస్తాం...
నిందితుడి స్నేహితుడు సైతం కొన్నాళ్లు ఆ యువతి వెంట ప్రేమ పేరుతో తిరిగాడు. అతన్ని సైతం దూరం పెట్టింది బాధితురాలు. కక్ష పెంచుకున్న రెండో వ్యక్తి యువతి నగ్న దృశ్యాలను పోర్న్సైట్లో పెట్టాడు. కొన్ని రోజులకు తీసేశాడు. ఈ వ్యవహారం 2017 నుంచి జరుగుతోంది. అయితే కొన్ని రోజుల నుంచి ఆ యువతికి ఓ అజ్ఞాత వ్యక్తి సంబంధిత దృశ్యాలను పంపించడం మొదలుపెట్టాడు. డబ్బులిస్తే వీటిని తొలిగిస్తానని వేధించాడు.