ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2023, 11:35 AM IST

ETV Bharat / state

New Zones proposals in AP ఉద్యోగ నియామకాలు-బదిలీలకు సంబంధించి.. రాష్ట్రంలో పెరగనున్న జోన్ల సంఖ్య..?

Employment Zones in AP: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించి జోన్ల సంఖ్యను పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు తగిన చర్యలను చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగ నేతలతో ప్రభుత్వం చర్చించింది. వారు కూడా ప్రభుత్వ నిర్ణయానికి అడ్డు చెప్పకపోవటంతో త్వరలోనే జోన్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Employment Zones
ఏపీ జోన్లు

Govt Looking For Employment Zones Incresing In Andhra Pradesh: రాష్ట్రంలో ఇకపై జోన్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం నాలుగు జోన్ల వ్యవస్థ ఉండగా.. కొత్త జిల్లాలకు అనుగుణంగా మరో 2 నూతన జోన్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిద్వారా ఉద్యోగ నియామకాలు, బదిలీలకు ఆరు జోన్ల వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. జోన్ల పెంపుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జీఏడీ కార్యదర్శి చర్చించారు. ఉద్యోగ నేతలెవరూ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో.. ఆరు జోన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌పై రాష్ట్రపతి ఉత్తర్వులు-1975కు సవరణ ప్రతిపాదనపై.. సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌ కార్యదర్శి భాస్కర్‌ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జోనల్, మల్టీ జోనల్‌ వ్యవస్థ, పోస్టుల కేడర్‌పై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. అన్ని అంశాలపై గురువారంలోపు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. జోన్ల పెంపుపై ఉద్యోగ నాయకులు అభ్యంతరం చెప్పకపోవడంతో.. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

అల్లూరి, తిరుపతి జిల్లాలు ఏ జోన్లలో ఉండనున్నాయి: అల్లూరి జిల్లాను కాకినాడ జోన్‌లోకి తీసుకురావాలా, లేక విశాఖ జోన్‌లో ఉంచాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిపాదిత జోన్‌ల వ్యవస్థలో అల్లూరి జిల్లాను కాకినాడ జోన్‌లో పెట్టారు. తిరుపతి జిల్లాను నెల్లూరుతో కలిపి ఓ జోన్‌లో ఉంచాలా, లేదంటే వైఎస్సార్​ జిల్లాతో కలిపి జోన్‌ ఏర్పాటు చేయాలా అనే అంశంపైనా ఉద్యోగ నాయకుల అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరింది. ప్రతిపాదిత 6 జోన్‌ల వ్యవస్థలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్​ జిల్లాలను ఐదో జోన్‌గా ఏర్పాటు చేశారు.

ఆరు జోన్లు రెండు మల్టీ జోన్లు: మొత్తం 6 జోన్‌లతోపాటు రెండు మల్టీ జోన్‌లు ఉంటాయి. రాష్ట్ర స్థాయి కేడర్‌ అనేది ఇక ఉండకపోవచ్చు. మల్టీ జోన్‌ వ్యవస్థను అమలు చేసే అవకాశముంది. రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర విభాగాధిపతి, రాష్ట్రస్థాయి కార్యాలయం, రాజధాని ప్రాంతంలోని కమిషనరేట్లలో పోలీసు నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు. రాజధాని ప్రాంతంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పైన ఉండే అన్ని కేడర్లను.. జోనల్‌ స్థాయిగా ప్రభుత్వం ప్రతిపాదించింది.

సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులను జోనల్‌ స్థాయిగానూ.. తహసీల్దార్, ఆపైన పోస్టులను మల్టీ జోన్‌గానూ పేర్కొంది. జిల్లా, జోన్, మల్టీ జోన్‌ నియామకాల్లో స్థానికులు 95శాతం, స్థానికేతరులు 5 శాతం ఉండేటట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు చేయనందున.. దీనిపై మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. జోనల్, మల్టీ జోనల్‌కు 80:20 విధానం అమలు చేయాలని కొన్ని సంఘాల ప్రతినిధులు విన్నవించారు.

స్థానికత ప్రామాణికం ఏది: రాష్ట్రంలో 500 కోట్లు దాటిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారికి జోనల్‌ విధానం వర్తింపజేయాలని.. ఏపీఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు కోరారు. ఉద్యోగుల అంగీకారంతోనే జిల్లాస్థాయి బదిలీలు చేయాలని.. ఉద్యోగులు నష్టపోకుండా జోనల్‌ వ్యవస్థ ఉండాలని అన్నారు. ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన విభజించేటప్పుడు.. ముందుగా వారి నుంచి ఐచ్ఛికాలు తీసుకున్న తర్వాతే పరిపాలనా సౌలభ్యం కోసం చర్యలు చేపట్టాలని ఏపీఐకాస-అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానికత ప్రామాణికం పదో తరగతా లేక ఏడో తరగతా అనే అంశంపైనా చర్చ జరిగిందని.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. స్థానిక కేడర్‌కు వెళ్లే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

"తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసకున్న విధంగా 90శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా.. మన రాష్ట్రంలో కూడా 90 శాతం వరకు జిల్లా, జోన్లలో, మల్టీ జోన్ల ఉద్యోగాలు, స్థానికులకే చెందేలా చర్చించుకోవటం జరిగింది." - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఐకాస-అమరావతి ఛైర్మన్

"నాలుగు జోన్లలోనే కొనసాగిద్దామా.. నూతన జోన్లను ఏర్పాటు చేసుకుందామా అనే అంశలపై చర్చించటం జరిగింది." -వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం

ABOUT THE AUTHOR

...view details