Government Employees Salaries : ఈ నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియక పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెలా జీత భత్యాలకు కలిపి దాదాపు 6 వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయి. కానీ, ఇప్పటివరకు 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీ సచివాలయం సెక్షన్ అధికారుల సంఘం అధ్యక్షుడు రంగస్వామి ఆధ్వర్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఆర్థిక శాఖ అధికారులకూ ఇచ్చారు. సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ ఎన్జీవోల సంఘం.. ఉద్యోగులకు జీతాలు త్వరితగతిన చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.
ఇప్పటి వరకూ వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో జమకాకపోవటంపై ఆందోళన నెలకొందని నేతలు సీఎస్‌కు వివరించారు. ఇంటి అద్దె, ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సచివాలయంలో ఆర్థిక, సాధారణ పరిపాలన, అసెంబ్లీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు జీతాలు అందాయి. మిగతా వారిలో కొందరికే ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకున్నవారే ఉంటున్నారు. వారు ఐదో తేదీలోగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెలా జాప్యం కారణంగా సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. దాంతో బయట ప్రైవేటుగా అప్పులు చేసి ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.