Employees Associations Opposes GPS : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని అంగీకరించేందుకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ఈ పాలసీతో పెద్దగా ఉపయోగం ఉండదంటూ వ్యతిరేకిస్తున్న నేతలు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించాయి. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేశాయి.
సీపీఎస్ రద్దు చేయకపోతే ఐక్యంగా ఉద్యమిస్తాం :వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్యారెంటీ పింఛన్ స్కీమ్-జీపీఎస్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని..ఉద్యోగ సంఘ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో అభిప్రాయాన్ని వెల్లడించారు. సీపీఎస్ రద్దు చేయకపోతే ఐక్యంగా ఉద్యమిస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో జీపీఎస్‌పై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రాలేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. జీపీఎస్‌పై ఉత్తర్వులు ఇచ్చేముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని మళ్లీ రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి తీసుకురావద్దని ఆయన అన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్లు : సకాలంలో జీతాలు, పింఛన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పింఛనుదారుల డీఏ, పీఆర్సీ బకాయిల్ని డిసెంబరు నాటికి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను తెలంగాణతో సమానంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.