ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల అయినా సకాలంలో జీతాలు పడతాయా..! ఉద్యోగుల్లో టెన్షన్​

AP Employees Salaries: నెలాఖరు వస్తుందంటే చాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం మొదలవుతోంది. ఈనెల అయినా సకాలంలో జీతాలు పడతాయా లేదా అని ఆందోళన వ్యక్తమవుతోంది. జీతాలు బిల్లులు అన్నీ సక్రమంగా సమర్పిస్తేనే ప్రతి నెల 20వ తారీఖు వరకు వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండగా....ఆర్థిక సంవత్సరం చివరి ఏడాది కావడంతో చాలా రోజులుగా సీఎఫ్​ఎమ్ఎస్ వైబ్‌సైట్‌ మూతపడింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 30, 2023, 9:13 AM IST

Updated : Mar 30, 2023, 12:19 PM IST

ఈ నెల అయినా సకాలంలో జీతాలు పడతాయా..! ఉద్యోగుల్లో టెన్షన్​

AP Employees Salaries : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల కూడా సకాలంలో వేతనాలు అందకపోవచ్చన్న చర్చ ఉద్యోగుల్లో అప్పుడే మొదలైంది. సాధారణంగా ఉద్యోగులు జీతాల బిల్లులు ప్రతి నెలా ఈ పాటికే చాలా వరకు సమర్పిస్తుంటారు. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో సీఎఫ్​ఎమ్ఎస్ వెబ్‌సైట్‌ చాలా రోజులుగా మూతపడి ఉంది. జీతాల బిల్లులను సమర్పించేందుకు సోమవారం రాత్రి మాత్రమే ఈ వెబ్‌సైట్‌ను డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు, ఖజానా అధికారులకు అందుబాటులో ఉంచారు. బిల్లులు సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారు. దాంతో జాప్యం జరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో సమీకరించే రుణాలు, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులపై ఆధారపడి జీతాలు, పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చెల్లిస్తూ వస్తోంది. వచ్చే నెల నుంచి కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభమవుతుండటంతో రిజర్వుబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలన్నా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుందని అధికారిక వర్గాలే తెలిపాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత..? రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపేణా ఎన్ని నిధులు రుణంగా పొందుతోంది? మిగిలిన మేర ఏడాది మొత్తానికి బహిరంగ మార్కెట్‌ రుణం ఎంత మేరకు అనుమతులు ఇవ్వనున్నారు అనే అంశాలు కేంద్ర ఆర్థిక శాఖ తేల్చాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగాల్సి ఉంది. ఆ అనుమతులు వచ్చే లోపు సాధారణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ముందస్తుగా కొంత రుణం కోసం అనుమతులు కోరే అవకాశమూ ఉంది. వాటికి అనుమతులు రావడానికీ సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, పెన్షన్లకు అవసరమైన నిధుల సమీకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో అనేక బిల్లులు, ఇతరత్రా చెల్లించాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్ల వరకు వివిధ అవసరాల నిమిత్తం ఖర్చు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నెలాఖరులోగా వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌలభ్యాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా రిజర్వుబ్యాంకు కల్పించిన వెసులుబాట్లు ఉపయోగించుకుని మైనస్‌ నిల్వతో ప్రారంభించేందుకు ఆస్కారం లేదు.

అందువల్ల వేస్‌ అండ్‌ మీన్స్‌ వంటి వాటి నుంచి మరో 3 రోజుల్లో బయటపడాల్సి ఉంటుంది. ఆ మేరకు నిధులు సమకూర్చుకోవాలి. మరోవైపు సామాజిక పెన్షన్ల నిమిత్తం ఏప్రిల్‌ ఒకటి నాటికి రూ.1600 కోట్లు, జీతాలు, పెన్షన్ల రూపంలో మరో రూ.5వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. కాబట్టి మార్చి నెల జీతాలు, పింఛన్లు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఎంతకాలం పడుతుందో అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది.


ఇవీ చదవండి

Last Updated : Mar 30, 2023, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details