ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలపై విద్యుత్‌ భారం రూ.10వేల కోట్లు..! ఏఆర్‌ఆర్‌పై నిపుణుల అభ్యంతరాలు - ఏఆర్‌ఆర్‌పై నిపుణుల అభ్యంతరాలు

EXPERTS FIRES ON APERC : మూడున్నరేళ్లలో ఒక్కసారే విద్యుత్‌ ఛార్జీలు పెంచామని ప్రభుత్వం చెబుతున్నా.. వేర్వేరు మార్గాల్లో ప్రజలపై 10 వేల కోట్ల భారం మోపిందని నిపుణులు అంటున్నారు. వాస్తవాలను దాచేసిన డిస్కంలు, పొంతనలేని సమాధానాలు చెబుతున్నాయని ఆగ్రహించారు. 2023-24కు సంబంధించి దాఖలుచేసిన ఆదాయ అవసరాల నివేదిక(ARR)పై.. విశాఖలో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణ వేదికగా అభ్యంతరాలు, ప్రశ్నలు లేవనెత్తారు.

EXPERTS FIRES ON APERC
EXPERTS FIRES ON APERC

By

Published : Jan 20, 2023, 9:12 AM IST

ప్రజలపై విద్యుత్‌ భారం రూ.10వేల కోట్లు..! ఏఆర్‌ఆర్‌పై నిపుణుల అభ్యంతరాలు

EXPERTS FIRES ON APERC : స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు కోసం రూ.20వేల కోట్లను ప్రభుత్వం వృథాగా ఖర్చు చేస్తోందని.. విద్యుత్ నిపుణులు విమర్శించారు. కేవలం ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌, అదానీ వంటి సంస్థల లబ్ధికే మీటర్ల ఏర్పాటు పథకమని ఆరోపించారు. పునరుత్పాదక విద్యుత్‌ సంస్థల నుంచి తీసుకునే 8వేల మెగావాట్ల విద్యుత్‌తో గ్రిడ్‌ నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతుందని చెబుతున్న డిస్కంలు.. మళ్లీ సెకి నుంచి 17 వేల మిలియన్‌ యూనిట్ల సౌర విద్యుత్‌ తీసుకుంటే గ్రిడ్‌ బేస్‌ లోడ్‌ నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

మిగులు విద్యుత్‌ ఉందని చెబుతూనే..పునరుత్పాదక విద్యుత్‌ కొనడం వల్ల ఏటా 5 వేల కోట్లు నష్టం వస్తున్నట్లు డిస్కంలు ఇప్పటికే లెక్కలు చెబుతున్నాయి అంటూ.. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (APERC) పై నిపుణులు ప్రశ్నలు సంధించారు. పగటి వేళల్లో 12వేల 500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉందని ఏఆర్​ఆర్(ARR)​లో ప్రస్తావించిన డిస్కంలు... సెకి నుంచి కొనే విద్యుత్‌తో కలిపితే ఏటా సుమారు 30వేల MUల మిగులుకు విద్యుత్‌ చేరుతుందని గుర్తుచేశారు. ఆ విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తామని డిస్కంలు చెబుతున్నాయని.. ఇదేం పద్ధతని నిలదీశారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసే 29 పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను తీసుకోడానికి మళ్లీ పీపీఏలను ప్రభుత్వం కుదుర్చుకునే అవకాశం ఉందన్న నిపుణులు.. ఆ విద్యుత్‌ను ఏం చేస్తారని ప్రశ్నించారు. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌ను మస్ట్‌ రన్‌ విధానం కింద కచ్చితంగా తీసుకోవాలన్నారు.

వడ్డీ భారం ఎవరు భరిస్తారు?: డిస్కంలకు 21వేల 272 కోట్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని.. ఈ మొత్తాన్ని వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం డిస్కంలు అప్పులు చేయాల్సి వస్తోందని నిపుణులు అన్నారు. వాటిపై చెల్లించే వడ్డీల భారం డిస్కంలపై పడుతోంది.. ఆలస్యమైన కాలానికి వడ్డీని ప్రభుత్వమే భరించాలని కోరారు. లేదంటే అదంతా ప్రజలపైనే పడుతుందని గుర్తుచేశారు. హిందుజా సంస్థకు ఉత్పత్తి నిలిపేసిన కాలానికి స్థిర ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో సరఫరా చేయని విద్యుత్‌కు కూడా లెక్కగట్టి స్థిర ఛార్జీల కింద రూ.12వందల కోట్లు చెల్లించాలని సంస్థ అడగడం ఏంటని కొందరు నిలదీశారు.

పునరుత్పాదక విద్యుత్‌తో గ్రిడ్‌ నిర్వహణ ఎలా?:రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ సుమారు 12వేల 500 మెగావాట్లు కాగా.. ఇప్పటికే డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం 8వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉన్న విషయం ప్రస్తావించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి దశల వారీగా మరో 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సెకి నుంచి ప్రభుత్వం తీసుకోనుందని.... ఈ మొత్తం కలిపితే గరిష్ఠ డిమాండ్‌ కంటే ఎక్కువన్నారు.

ఇది ప్రమాదకరమని.. దీనివల్ల గ్రిడ్‌ నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందని విద్యుత్‌ రంగ నిపుణుడు వేణుగోపాలరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి, ఇకపై నెలకోమారు విద్యుత్ ఛార్జీలు పెంచితే... సామాన్యుల పరిస్థితి ఏంటని సీపీఎం నేత బాబూరావు ప్రశ్నించారు.

ప్రభుత్వం రాయితీ ఇస్తుందనే నమ్ముతున్నాం:విద్యుత్తు పంపిణీ సంస్థలకు ప్రభుత్వం రాయితీ నిధులను ఇస్తుందనే నమ్మకంతోనే ఆయా సంస్థల ప్రతిపాదనలపై ముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. విశాఖలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో 2023-24కి సంబంధించి డిస్కంల ఏఆర్‌ఆర్‌ నివేదికపై గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘డిస్కంల ప్రతిపాదనలు, టారిఫ్‌ల మధ్య ఎంత లోటు ఉందో ఆ మేరకు ప్రభుత్వం ఏటా రాయితీ ఇస్తుంది..ఈ ఏడాది కూడా అలా ఇస్తారనే ఆశిస్తున్నాం’ అని ఈఆర్సీ ఛైర్మన్‌ చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించాకే రాయితీ సొమ్ము రూ.10వేల కోట్లా.. రూ.13వేల కోట్లా అనేది తేలుతుందన్నారు. సామాన్య వినియోగదారులపై భారం పడకూడదనేది ప్రభుత్వ ఆలోచనని, కమిషన్‌ కూడా ఆ విధంగా సూచనలు చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది డిస్కంల ప్రతిపాదన ప్రకారం ఒక్క ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలపైనే కొంత మేర ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు.

నిరసనల వెల్లువ:విద్యుత్తు ధరల పెంపుపై విశాఖలోని గురుద్వారా దరి ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వామపక్షాలు అక్కడే నిరసన తెలిపాయి. విజయవాడలోని విచారణ మందిరంలోనూ సీపీఎం ఆధ్యర్యంలో నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details