కొత్త విద్యుత్ సవరణ చట్టం వల్ల అటు వినియోగదారులతోపాటు ఉద్యోగులు సైతం నష్టపోయే ప్రమాదం ఉందని విద్యుత్తు ఉద్యోగుల ఐకాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేెశారు. ఈ మేరకు గుంటూరు విద్యుత్ భవన్ ఎదుట ఐకాస ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సమ్మెలను నిషేధిస్తూ.. ఓవైపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మూడో రోజు ఆందోళన కొనసాగించారు.
సమ్మెలు నిషేధిస్తూ ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఓసారి జారీ చేస్తుందని... ఇలాంటి ఉత్తర్వులను చూసి ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఐకాస నేతలు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగించాలని ఉద్యోగులకు ఐకాస నేతలు పురుషోత్తంరావు, రాజేశ్ ఖన్నా సూచించారు.