Eighth Nizam Nawab Dead: ఎనిమిదో నిజాం నవాబు మీర్ అలీఖాన్ ముఖరంజా బహదూర్ కన్నుమూశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో నిన్న రాత్రి ముఖరంజా బహదూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఈనెల 17న హైదరాబాద్ తీసుకురానున్నారు. అంత్యక్రియలు స్వస్థలమైన హైదరాబాద్‌లోనే చేయాలన్న ముఖరంజా బహదూర్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. 17న చౌమహల్లా ప్యాలెస్‌లో పార్థివదేహాన్ని ఉంచి సంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసి, అనంతరం అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అధికారిక లాంఛనాలతో నిజాం అంత్యక్రియలు: హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మనుమడు, నిజాం పెద్ద కుమారుడు ముఖరంజా బహదూర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడిగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముఖరంజా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నత స్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.