ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.వంద కోట్ల ముడుపుల పంపిణీలో.. కీలక పాత్రధారి బోయినపల్లి అభిషేక్​

Delhi Liquor Scam Update: వంద కోట్ల రూపాయల ముడుపుల కేసులో తెలంగాణకు చెందిన బోయినపల్లి అభిషేక్‌, కీలక పాత్రధారి అని సీబీఐ కోర్టులో ఈడీ తెలిపింది. విజయ్‌నాయర్‌ ప్రణాళిక రచిస్తే, అభిషేక్‌ అమలు చేసినట్లు ఆరోపించింది. హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు తెలిపింది. ఈ కేసులో అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ల కస్టడీని న్యాయస్థానం మరో 5 రోజులు పొడిగించింది.

Boinapally Abhishek
బోయినపల్లి అభిషేక్​

By

Published : Nov 20, 2022, 11:59 AM IST

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం కుంభకోణంలో వంద కోట్ల ముడుపులు చేతులు మారాయని, వాటి పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బోయినపల్లి అభిషేక్‌ కీలక పాత్రధారి అని సీబీఐ కోర్టులో ఈడీ పేర్కొంది. దక్షిణాది సిండికేట్‌ నుంచి వచ్చిన మొత్తాన్ని సమకూర్చడంలో, పంపిణీకి ప్రణాళిక వేసిన వారిలో, విజయ్‌నాయర్‌ కీలకమని తెలిపారు. ఆ మొత్తంలో అభిషేక్‌ 30 కోట్లు హవాలారూపంలో తీసురాగా, మిగతా సొమ్మును దిల్లీలో సర్దుబాటు చేశారని వివరించింది.

దిల్లీ మద్యం కుంభకోణంలో, అరెస్టై కస్టడీలో ఉన్న బోయినపల్లి అభిషేక్‌, విజయ్‌నాయర్‌ కస్టడీ పెంచాలని కోరుతూ కోర్టులో.. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ వివరించింది. విచారణలో భాగంగా, ఈడీ న్యాయవాదులు అందించిన లిఖిత పూర్వక వాదనల్లో పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. పెర్నాడో రికార్డ్‌ కంపెనీ సీనియర్‌ అధికారికి.. తానూ దిల్లీ ఎక్సైజ్‌ విధానం ఒఎస్​డీని అని విజయ్‌నాయర్‌ పరిచయం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.

ఆప్‌లో సాధారణ వాలంటీర్‌ అయిన విజయ్‌నాయర్‌ దిల్లీ ఎక్సైజ్‌ శాఖలో ఏనాడూ ఏ హోదాలోనూ పనిచేయలేదని తెలిపింది. కానీ ఒఎస్​డీని అని మద్యంకంపెనీ ప్రతినిధులతో చెప్పేవాడు. దిల్లీ రెవెన్యూ, రవాణాశాఖ మంత్రి కైలాస్‌గహ్లోత్‌కి కేటాయించిన అధికారిక నివాసంలో నాయర్‌ నివసించేవాడని కోర్టుకు వివరించింది. మంత్రి కైలాస్‌, తనకు నజఫ్‌గఢ్‌లో ఉన్న మరో ఇంట్లో ఉండేవారని ఈడీ పేర్కొంది.

దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపొందించిన మంత్రుల బృందంలో కైలాస్‌ సభ్యుడిగా ఉన్నారన్న ఈడీ, దిల్లీ మద్యం పాలసీలో ఉన్నవారంతా విజయ్‌నాయర్‌ సన్నిహితులైన మద్యం ఉత్పత్తిదారులు, పంపిణీదారులని గుర్తించినట్లు వివరించింది. దిల్లీ మద్యం విధానాన్ని గత జులై 5న అధికారికంగా ప్రకటించగా, సుమారు రెండునెలల ముందే విజయ్‌నాయర్‌కి చేరింది.

మద్యం ఉత్పత్తిదారులు, పంపిణీదారుల ఈ-మెయిళ్లు, వాట్సప్‌ గ్రూపుల్లో దిల్లీ ఎక్సైజ్‌ విధానం డాక్యుమెంట్లు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. విధానం ప్రకటించక ముందు నుంచే మద్యం ఉత్పత్తి కంపెనీ ఉద్యోగులంతా విజయ్‌నాయర్‌తో సంబంధాలు కలిగి ఉండడంతో పాటు ఆయనతో పలుమార్లు సమావేశమయ్యారని వివరించింది. కుంభకోణం బట్టబయలు కావడంతో విజయ్‌ నాయర్‌ ఫోన్‌ను మార్చివేశాడని నివేదికలో ఈడీ పేర్కొంది.

మద్యం కుంభకోణంలో అరబిందో శరత్‌ చంద్రారెడ్డి కంపెనీకి చెందిన చందన్‌ రెడ్డి, బుచ్చిబాబుల నుంచి సమాచారం రాబట్టామని, మరికొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఐతే విజయ్‌నాయర్‌, అభిషేక్‌ను మరో తొమ్మిది రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. నిందితుల నుంచి ఈడీ అధికారులు కావాల్సినంత సమాచారం తీసుకున్నారని, ఎలాంటి నగదు, పత్రాలు స్వాధీనం చేసుకోలేదని, వారిని కస్టడీకి ఇవ్వవద్దని కోరారు. వాదనల అనంతరం అభిషేక్‌, విజయ్‌నాయర్‌ల ఈడీ కస్టడీని మరో అయిదు రోజుల పాటు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.

రూ.వంద కోట్ల ముడుపుల పంపిణీలో.. కీలక పాత్రధారి బోయినపల్లి అభిషేక్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details