EBC Nestham Stopped for TDP Candidates: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి, వేల్పూరులో ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేయలేదనే కారణంతో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారిలో అర్హులకు ఈబీసీ నేస్తం పథకం అందకుండా క్షేత్ర స్థాయి సిబ్బంది మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో అర్హుల పేర్లు ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అభ్యర్థుల వేలిముద్రలు సేకరించకుండా గ్రామంలో లేరని వాలంటీర్లు నమోదు చేశారు. కారుమంచిలో ఈబీసీ నేస్తం కింద 110 మంది అర్హత సాధించారు. వీరికి 9వ తేదీన రూ.15వేలు ఆర్థిక సాయం అందజేసేందుకు వేలిముద్రలు తీసుకున్నారు. అర్హుల్లో తెదేపాకు చెందిన 40 మంది అభ్యర్థుల వేలిముద్రలను సేకరించలేదు. వేల్పూరులో 122 మంది అర్హులుండగా... 36 మంది వివరాలను నమోదు చేయలేదు. దీనిపై ఎంపీడీవో కె.మాథ్యూబాబును వివరణ కోరగా.. వాలంటీర్లు వెళ్లిన సమయంలో ఆయా అభ్యర్థులు ఇళ్లవద్ద లేరని చెప్పారు.
ఇతర జిల్లాలకు పింఛన్ల బదిలీ...
ఇటీవల జరిగిన శావల్యాపురం జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేయలేదనే సాకుతో తమ పింఛన్లను వైకాపా నాయకులు ఇతర జిల్లాలకు బదిలీ చేయించారని వయ్యకల్లు గ్రామానికి చెందిన లబ్ధిదారులు సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన అల్లూరి వెంకట్రావు, కొణిదన ఏడుకొండలు, కర్రి ఈశ్వరవాణి, గోనుగుంట్ల చిన్న వెంకటేశ్వర్లు పింఛన్లను కృష్ణా జిల్లా నందిగామ, కంచికర్ల, గుంటూరు జిల్లా బెల్లంకొండ, తూర్పుగోదావరి జిల్లా తునికి బదిలీ చేయించారు. అధికార పార్టీ నేతలు, గ్రామ సచివాలయ కార్యదర్శి, సిబ్బంది కుమ్మక్కై సచివాలయ వెల్ఫేర్ లాగిన్ నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేయించారని బాధితులు ఆరోపించారు. నష్టపోయిన పింఛనును బాధ్యులైన వారి నుంచి ఇప్పించే విధంగా చూడాలని జిల్లా కలెక్టరును కోరారు. దీనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని లబ్ధిదారులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. క్షేత్రస్థాయిలో విచారణ చేసి, బాధ్యులపై తగు చర్యలకు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఎంపీడీవో కె.మాథ్యూబాబు తెలిపారు.
ఇదీ చదవండి:TDP Strategy Meeting: మరింతగా ఉద్యమించండి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు నిర్దేశం