వీధుల్లో తిరగకముందే మొరాయింపు E Autos Problems: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 516 ఇ-ఆటోలను 21కోట్ల 18లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 500 కిలోల మేర చెత్త తరలించే సామర్థ్యం గల ఒక్కో ఆటోకు 4.10 లక్షల రూపాయలు వెచ్చించారు. తయారీ సంస్థ వీటిని ఆరేడు నెలల క్రితమే సరఫరా చేయగా.. గుంటూరు, విజయవాడలో స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారులు భద్రపరిచారు. సీఎం జెండా ఊపి వీటిని ప్రారంభించడానికి ఈ నెల 8న తాడేపల్లి తీసుకొచ్చారు.
రెండు నెలలకే ఐదు పక్కకి: ఒకసారి ఆటోకు పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలో మీటర్ల వరకు నడపొచ్చని అధికారులు చెబుతుండగా.. 40 నుంచి 50 కిలో మీటర్లకే మొరాయిస్తున్నాయని వీటిని నడిపే కార్మికులు అంటున్నారు. అరటన్ను చెత్త తరలించే సామర్థ్యం వీటికి ఉంటుందని చెబుతున్నా.. 350 నుంచి 400 కిలోలకు మించి తరలించడం కష్టమని కార్మికులు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా 60 ఆటోలను వీధుల్లో చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. వీటిలో సాంకేతిక సమస్యలతో రెండు నెలలకే ఐదు ఆటోలను పక్కన పెట్టారు. ఛార్జింగ్ ఎక్కక, ఫ్యూజులు పోవడం, బ్యాటరీల్లోకి నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తాయి.
శనివారం మొరాయించిన 10ఆటోలు:కుంచనపల్లిలోని ఒక ఖాళీ ప్రదేశంలో పెట్టిన ఆటోలను మూడు రోజులైనా ఎంపిక చేసిన పురపాలక, నగర పంచాయతీలకు తరలిస్తూనే ఉన్నారు. బ్యాటరీ ఛార్జింగ్ లేక కొన్ని, సాంకేతిక సమస్యలతో ఇంకొన్ని ఉండిపోయాయి. వీటిని ఎలాగైనా తరలించే క్రమంలో ఒక జనరేటర్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఛార్జింగ్ పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించే అవకాశం లేని ఆటోలను బాగున్న ఆటోలకు తాళ్లతో కట్టి పంపుతున్నారు. శనివారం దాదాపు పది ఆటోలు మొరాయించినట్లు సమాచారం. చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, తదితర ప్రాంతాలకు కంటెయినర్‌లో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రుసుముల వసూళ్లపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత: ఇ-ఆటోలతో చెత్త సేకరణ మరింత భారమవుతుందని పలువురు కమిషనర్లు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో పట్టణానికి 10కిపైగా ఆటోలు కేటాయించారు. వాయిదా కింద నెలకు ఒక్కో వాహనానికి 10 వేల రూపాయల చొప్పున మొత్తం లక్ష చెల్లించాలి. కొన్ని నగర పంచాయతీల్లో చెత్త తరలింపునకు రెండు సొంత ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. వీటికి డీజిల్ ఖర్చులు భరిస్తే సరిపోతోంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలోని ఒక నగర పంచాయతీలో రెండు ట్రాక్టర్లతో చెత్త సేకరిస్తున్నందుకు డీజిల్ ఖర్చుల కింద నెలకు 40 నుంచి 50 వేలు వరకు వెచ్చిస్తున్నారు. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయడం లేదు. ఇదే నగర పంచాయతీకి ప్రస్తుతం 12 ఇ-ఆటోలు కేటాయించారు. వీటికి నెల వాయిదా కింద 1.20 లక్షలు చెల్లించాలి. ఇందు కోసం ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలి. ఇప్పటికే చెత్త సేకరణ అమలులో ఉన్న 42 నగరాల్లో రుసుముల వసూళ్లపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాంట్రాక్ట్ సంస్థలకే అధిక ప్రయోజనం: చెత్త సేకరణకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వాహనాలతో కాంట్రాక్టు సంస్థలకే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. 2021 అక్టోబరు 2 నుంచి 42 పట్టణాల్లో ప్రవేశపెట్టిన డీజిల్ ఆటోలను నిర్మించు-నిర్వహించు-బదిలీ చేయి విధానంలో ఒక ప్రైవేట్ సంస్థ 2వేల 213 ఆటోలను సరఫరా చేసింది. ఒక్కో ఆటోకు నెలకు 23వేల500 రూపాయల చొప్పున పుర, నగరపాలక సంస్థలు వాయిదా కింద చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాలను పురపాలకశాఖ నుంచి కాంట్రాక్టు సంస్థకు నెలకు 5.20 కోట్లకుపైగా చెల్లిస్తున్నారు. చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి వసూలు చేస్తున్న వినియోగ రుసుముల నుంచే ఈ మొత్తాలను జమ చేస్తున్నారు.
బయటకు రాని పలు విషయాలు: 36 చిన్న పురపాలక, నగర పంచాయతీలకు కేటాయించిన 516 ఇ-ఆటోలకు ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి స్వచ్ఛాంధ్ర సంస్థ రుణం తీసుకొని కొనుగోలు చేసింది. ప్రజల నుంచి పుర, నగర పంచాయతీలు రుసుములు వసూలు చేసి వాటిని పురపాలకశాఖకు చెల్లించాలి. వాటిని మళ్లీ స్వచ్ఛాంధ్ర సంస్థ నుంచి A.P.U.F.I.D.Cకి వాయిదాలుగా చెల్లిస్తారు. ఇ-ఆటోల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లు పిలవడం నుంచి వీటి సరఫరాదారును ఖరారు చేసే వరకు వివరాలను స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారులు గోప్యంగా ఉంచారు. టెండర్లలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? రివర్స్ టెండర్లలో ఒక్కో ఆటో సరఫరాకు సంస్థలు ఎంత ధర కోట్ చేశాయి, వీటిలో నుంచి టెండర్ దక్కించుకున్న సంస్థ కోట్ చేసిన ధర ఎంత? అనే విషయాలు బయటకు చెప్పడం లేదు.