గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసకందాయంగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గం అంటూ అధికార వైకాపా, నారా లోకేశ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నియోజకవర్గం అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఇక్కడ ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత ఏడాది మండలంలో మొత్తం 18ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లోనూ, వైకాపా అభ్యర్థులు 8స్థానాల్లో, 1స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు.
జనసేన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినా, రాజకీయ వివాదాలు, ఇతరత్రా కారణాల చేత ఎంపీపీ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావటంతో....తెలుగుదేశం తరఫున గెలిచిన మహిళా అభ్యర్థి షేక్ జబీన్‌కు బీసీ-ఇ ధ్రువపత్రం ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చిందని ఆ పార్టీ ఆరోపించింది. అప్రజాస్వామిక విధానాలతో పాటు అధికార అండతో పదవిని దక్కించుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోందని తెలుగుదేశం ఎంపీటీసీలు చెబుతున్నారు
ఇదే సమయంలో అధికార పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు బీసీ మహిళల్లో వర్గపోరు వైకాపాకు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దుగ్గిరాల - 2 నుంచి గెలుపొందిన వైకాపా ఎంపీటీసీ పద్మావతి చెబుతుండడంతో ఆమె ఎన్నికకు హాజరుకాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారంటూ ఆమె తనయుడు యోగేందర్‌నాథ్ ఆరోపించారు. ఈ విషయంపైనే దుగ్గిరాల ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పలుమార్లు స్టేషన్‌కి పిలిచి బెదిరించారని వాపోయారు. ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని అనేక అవమానాలకు అధికారపార్టీ నేతలు గురిచేశారని.. వాటిని భరించలేకే ఎంపీపీగా పోటీ చేద్దామనుకుంటున్నట్లు తెలిపారు.