Guntur Government Hospita: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలకు పెట్టింది పేరు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు రోజుకు వేల సంఖ్యలో ఆస్పత్రికి వస్తారు. రోగులతోపాటు సహాయకులు వెంట వస్తారు. లోపల గదుల్లో ఇన్ పేషెంట్లకు తప్ప మరెవరికీ మరుగుదొడ్ల సదుపాయం కల్పించలేదు. రోగుల వెంట వారి సంఖ్యలో తరలివస్తారు. మల,మూత్ర విసర్జనకు ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడా సదుపాయం లేదు. రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకున్న తర్వాత రోగుల సహాయకులు బయటే ఉండాలి. వార్డుల్లో కాకుండా బయటే వందలాదిమంది విశ్రాంతి తీసుకుంటారు.
వీరికి తాగునీటితోపాటు మరుగుదొడ్లు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడ ఖాళీస్థలం దొరికితే అక్కడ విసర్జించడం వల్ల ఆస్పత్రి అపరిశుభ్రంగా మారుతోంది. పగటిపూట జనసంచారం ఉండటంతో ప్రధానంగా మహిళలకు కాలకృత్యాలు తీర్చుకోవడం సమస్యగా మారింది. ఒక్కోసారి దూరప్రాంతాలకు ఆటోలపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రివేళ జనసంచారం లేని సమయంలో మహిళలు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. క్యాజువాల్టీ వైపు గతంలో ఉన్న మరుగుదొడ్లను కొవిడ్ సమయంలో ఆక్సిజన్ సరపరా విభాగం ఏర్పాటు కోసం కూల్చివేశారు.