గుంటూరు జిల్లా బాపట్ల మండలం కర్లపాలెంలో సాగర్ రెడ్డి అనే వ్యక్తిని జులై 31 వ తేదీన దారుణంగా హత్య చేసి చంపిన ఘటనలో.. నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.
"ప్రధాన ముద్దాయి ఎస్కే హుస్సేన్ (బడే) కర్లపాలెంలో ఆటో నడుపుకుంటూ గంజాయి, మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ గంజాయిని చింతపల్లి నుంచి తెచ్చి విక్రయిస్తూ.. డబ్బు సంపాదించేవాడు. ఇదే క్రమంలో చనిపోయిన సాగర్ రెడ్డికి ఇతనికి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకి హైదర్ పెట్టకు చెందిన శివారెడ్డి వీరికి పరిచయం అయ్యాడు. ముగ్గురు కలిసి దొరికిన సందర్భాలను బట్టి మద్యం, గంజాయి తాగుతూ తిరుగుతుంటారు. హుస్సేన్, శివారెడ్డి తమ స్నేహానికి గుర్తుగా.. ' బెస్ట్ ఫ్రెండ్స్' అనే టాటూలు వేయించుకున్నారు. కొద్ది రోజులుకు హుస్సేన్ గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో శివ రెడ్డి కర్లపాలెం వచ్చేసాడు. దీంతో శివారెడ్డి, సాగర్ రెడ్డికి స్నేహం పెరిగింది. జైలు నుంచి వచ్చిన హుస్సేన్.. శివారెడ్డి కారణంగా సాగర్‌రెడ్డి తనను పట్టించుకోకపోవటంపై ఆగ్రహించాడు. ఈ క్రమంలో రెండు, మూడు సార్లు చేయి చేసుకున్నాడు. దీంతో శివారెడ్డిని కొడితే ఈసారి కర్లపాలెంలో తిరగనివ్వనని సాగర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు హుస్సేన్ ఉంటున్న రూము వద్దకు సాగర్ రెడ్డి అతని స్నేహితులతో కలిసి దాడి చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న హుస్సేన్ మిత్రులతో కలిసి చిలకలూరిపేట బయలుదేరాడు. దారిలో వారితో కలిసి మద్యం సేవించి.. సాగర్ రెడ్డికి ఫోన్ చేసి దూషించారు. అనంతరం నల్లమోతు వారి పాలెం సమీపంలో కాపు కాసి కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై సాగర్ రెడ్డి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచనున్నాం" అని డీఎస్పీ తెలిపారు.