గుంటూరు కేంద్రీయ ఔషధ భాండాగార సంస్థ భవనంలో ఎటుచూసినా ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఔషధాల డబ్బాలే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నిల్వ చేయడానికి స్థలం లేక, అమరావతి రోడ్డులోని వైద్యకళాశాల హాస్టల్ గదుల్లో కాలం చెల్లిన మందులు గుట్టలుగుట్టలుగా పడేశారు. 2019- 2020లో కొనుగోలు చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సిరంజీలు, సెలైన్ బాటిళ్లు, ఔషధాలు, పీపీఈ కిట్లు, ఏప్రాన్లు సహా అనేక మందులు వృథాగా పడి ఉన్నాయి. సహజంగా ఆస్పత్రులకు అవసరమైన ఉచిత ఔషధాలు, సర్జికల్ వస్తువుల వివరాల్ని ఈ-ఔషధి సైట్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎక్కడ ఏమందులు ఉన్నాయో ఈ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటప్పుడు మురిగిపోయే సమస్యే ఉండదు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో.... సీడీఎస్లోని కోట్లాది రూపాయల ఔషధాలు నిరుపయోగంగా మారినట్లు భావిస్తున్నారు.
వైద్య విభాగం నిర్లక్ష్యం.. రూ.కోట్లు విలువ చేసే ఔషధాలు నేలపాలు - guntur district latest news
మందులు కావాలని మొర పెట్టుకున్నా ఆలకించని వైద్య యంత్రాంగం... ఎక్స్‌పైరీ డేట్ ముగియడంతో కోట్లాది రూపాయల ఔషధాలు నేలపాలు చేయనుంది. పెద్దమొత్తంలో కొనుగోలు చేసిన ఔషధాలు, సర్జికల్స్ సామగ్రిని ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రులకు సరఫరా చేయకుండా గుంటూరు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మురగబెట్టేసింది. మందులు నిల్వ చేసిన తీరు చూస్తే సిబ్బంది అలసత్వానికి అద్దం పట్టేలా ఉంది.
ఒకవైపు మందుల్లేక రోగులు అల్లాడుతుంటే... అందుబాటులో ఉన్న మందులను స్టోర్స్ నుంచి పంపడంలో ఏపీ ఎంఎస్ఐడీసీ యంత్రాంగానికి, డ్రగ్‌స్టోర్స్ ఫార్మాసిస్టులకు మధ్య సమన్వయం లోపించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అదువల్లే పెద్దమొత్తంలో మందులు వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయనే వాదన వినిపిస్తోంది. రెండేళ్లు కొవిడ్ దెబ్బకు అవుట్ పేషెంట్ సేవలు నిలిపేయటం కూడా ఔషధాల నిల్వలు పేరుకుపోవటానికి కారణంగా భావిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, జిల్లా వైద్యాధికారి, ఏపీవీపీ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త, సీడీఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో కూడిన డ్రగ్స్ కమిటీ.... ప్రతి నెల ఔషధాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. నిల్వలు ఎంతమేర ఉన్నాయో తనిఖీ చేసి, అందుకు అనుగుణంగా పంపిణీ ప్రక్రియ చేపట్టాలి. ఇవన్నీ పక్కాగా జరగకపోవడం వల్లే కోట్లాది రూపాయల ఔషధాల వినియోగ గడువు ముగిసి వృథాగా మారినట్లు తెలుస్తోంది. ఇకనైనా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి:Love Medicine: ప్రేమను పుట్టించడానికీ మందులా...? వాడితే....