ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల వాడకంపై శిక్షణ Drone Training At Acharya Nagarjuna University: సాంకేతికత.. రైతుకు దన్నుగా నిలవాలే తప్ప కొత్త ఇబ్బందులు తేకూడదు. అందుకే సాగు డ్రోన్ల విషయంలో నిపుణులైన పైలట్లు ఎంతో అవసరం. డ్రోన్లు విచ్ఛలవిడిగా మార్కెట్‌లో దొరుకుతున్నా.. శిక్షణ విషయంలో మాత్రం సరైన సౌకర్యాలు లేని పరిస్థితి. లక్షలు పోసి కొన్న డ్రోన్లు సరిగ్గా వినియోగించకపోతే త్వరగా పాడయ్యే అవకాశముంది. ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్లను వాడే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. పంటలు పాడవుతాయి.
అందుకే కొందరు వ్యక్తులు, మరికొన్ని ప్రైవేటు సంస్థలు డ్రోన్ల వాడకంపై శిక్షణ అందిస్తున్నాయి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల వినియోగంపై కొద్దిరోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాగులో డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు చేసి కొన్ని ప్రమాణాలు రూపొందించి.. శిక్షణ అందిస్తున్నారు.
డ్రోన్ కోర్సుల నిర్వహణ కోసం అధికారులు ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. తరగతి గది శిక్షణతో పాటు క్షేత్రస్థాయిలోనూ డ్రోన్ల వినియోగాన్ని నేర్పించనున్నారు. శిక్షణకు సంబంధించిన అన్ని సౌకర్యాలను సమకూర్చారు. పౌరవిమానయాన శాఖ డిజిసిఏ నుంచి కూడా కోర్సులకు అనుమతి లభించింది. వ్యవసాయ డ్రోన్ల నిర్వహణపై దేశంలోనే తొలిసారిగా శిక్షణ అందిస్తున్న సంస్థగా ఆచార్య ఎన్జీ రంగా వర్శిటీ ఖ్యాతి గడించింది.
డిజిటల్ క్లాస్ రూంలు, డిజిటల్ లైబ్రరీ, అసెంబ్లింగ్ యూనిట్ ఇలా వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. లైసెన్స్ లేని డ్రైవింగ్ ఎంత ప్రమాదమో.. సరైన శిక్షణ లేకుండా డ్రోన్ ఆపరేట్ చేయడమూ అంతే ప్రమాదమని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగే అవకాశం ఉంది. వాటిని ఆపరేట్ చేసేందుకు అదే సంఖ్యలో పైలట్లు, కో పైలట్లు అవసరం అవుతారు. భవిష్యత్తులో ఇదో కొత్త ఉపాధి మార్గం కానుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: