DRIVER ESCAPED WITH GOLD IN HYDERABAD : యజమాని వద్ద నమ్మకంగా ఉంటూనే ఏకంగా ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారంతో ఉడాయించి టోకరా పెట్టాడు ఓ కారు డ్రైవర్. ఈ ఘటన తెలంగాణ హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని మైహోమ్ భోజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రాధిక అనే మహిళ నగల వ్యాపారం చేస్తోంది.
వజ్రాభరణాలు అవసరమైన వారికి ప్రముఖ నగల దుకాణాల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. ఆమె వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నమ్మకంగా మెలగడంతో అప్పుడప్పుడు కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను అతడికి ఇచ్చి పంపించేవారు. అయితే ఆభరణాలపై కన్నేసిన శ్రీనివాస్.. అందుకు తగిన పథకాన్ని సిద్ధం చేసుకుని సమయం కోసం ఎదురుచూశాడు. అనుకున్నట్లుగానే శ్రీనివాస్ కోరుకున్న టైం వచ్చింది.
అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉండే అనూష అనే కస్టమర్ రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కావాలని రాధికను సంప్రదించి ఆర్డర్ ఇచ్చారు. తీరా ఆర్డర్ చేసిన నగలను డెలివరీ చేసే సమయానికి తాను ఇంట్లో లేనని.. మధురానగర్‌లో ఉన్న తన చుట్టాల ఇంట్లో ఉన్నట్లు చెప్పి.. నగలను అక్కడికే పంపాలని కోరారు. దీంతో రాధిక.. డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్‌మెన్ అక్షయ్‌లతో మొత్తం రూ.7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పంపించారు. వాటిలో రూ.50 లక్షల విలువ గల నగలు అనూషవి అయితే.. మిగిలినవి సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కి ఇవ్వాల్సి ఉంది.