Water Crisis Looms in Guntur : రాష్ట్రంలోని పెద్ద నగరపాలక సంస్థల్లో గుంటూరు ఒకటి. ఇక్కడ 10 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా తాగునీటి సరఫరా వ్యవస్థను విస్తరించటంలో నగరపాలక సంస్థ పాలకమండలి, అధికారులు విఫలమయ్యారు.
మంచినీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలు : దీంతో నగరంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం నెలకొంది. వేసవి కావటంతో నీటి అవసరాలు పెరిగాయి. ఆ మేరకు సరఫరా లేకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. జనాభా ప్రాతిపదికన చూస్తే రోజుకు 120 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రకాశం బ్యారేజితో పాటు కృష్ణా కాలువల నుంచి నీటిని పంపింగ్ చేసి పైపు లైన్ల ద్వారా నగరానికి సరఫరా చేస్తారు. అయితే పంపింగ్ వ్యవస్థతో పాటు నీటి శుద్ధి వ్యవస్థ సరిగా లేకపోవటంతో నిర్దేశించిన దానిలో 70శాతం మాత్రమే నీరు సరఫరా చేయగలుగుతున్నారు. దీంతో శివారు కాలనీలలో నివశించేవారు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు.
నగపాలక సంస్థదే బాధ్యత : నగరంలోని ఎస్వీఎన్ కాలనీ, ఇన్నర్ రింగురోడ్డు, స్వర్ణభారత్ నగర్ ఇలా అనేక ప్రాంతాల్లోని ప్రజలు గత రెండుమూడు నెలలుగా మంచి నీటి కోసం నరకయాతన పడుతున్నారు. నిత్యం నీటి కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఏ సమయంలో నీరు వస్తాయో అర్థం కాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు తాగునీరు అందించే కనీస బాధ్యత నగపాలక సంస్థదే. కానీ ఆ విషయంలో యంత్రాంగం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.