Dr YSR Kanti Velugu Scheme Runnig Slowly కళ్లు సరిగా కనిపించని అవ్వాతాతలకు కళ్లజోళ్లు ఇచ్చి కొత్త ప్రపంచాన్ని చూపిస్తామని సీఎం జగన్ హామీతో వారంతా ఆశగా ఎదురుచూశారు. కళ్లల్లో వత్తులు వేసుకుని మరి కొత్త కంటి అద్దాల కోసం వేచి చూస్తున్నారు . నెలలు గడుస్తున్నా కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి దిక్కులేకపోయేసరికి వారు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో కళ్లజోడుకు కేవలం 160 రూపాయలు ఖర్చుపెట్టేందుకు ప్రభుత్వం వెనకాడుతోంది. ప్రభుత్వం ఇస్తుంది కదా అని.. కొత్తవి కొనుక్కోకుండా వృద్ధులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం ఇంకా వారిపై దయచూపటం లేదు. కంటి-వెలుగు పథకం రాష్ట్రంలో అమలు మొదటి నుంచి గందరగోళంగానే తయారైంది. ముఖ్యంగా అవ్వా, తాతలకు కళ్లజోళ్ల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కంటి పరీక్షలు నిర్వహించి వెంటనే కంటి అద్దాలు అందచేస్తామని చెప్పి నెలలు గడిచిపోతున్నా ఇంకా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 60 సంవత్సరాల వయసు దాటిన మొత్తం 57 లక్షల మందిలో.. 35 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా 12 లక్షల కళ్లజోళ్ల సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మూడు లక్షల మందికి కళ్లజోళ్ల పంపిణీ జరగాల్సి ఉంది. వీరిలో లక్షన్నర మందికి పైగా రాయలసీమలోనే ఉన్నారు. కడప జిల్లా ప్రజలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన వారైతే గత ఏడాది ఆగస్టు నుంచి ఎదురుచూస్తున్నారు.
ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ.. వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలను అనుసరించి వేర్వేరు టెండర్ల ద్వారా మూడు సంస్థలను ఎంపిక చేసింది. మొదటి టెండరు ద్వారా కొవిడ్ ముందు ఎంపిక చేసిన ఆక్రితి సంస్థకు ఒకకళ్లజోడు పంపిణీకి 67 రూపాయల ధరను ఖరారు చేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంపిణీ బాధ్యతలను అప్పగించారు. కొన్ని రోజులు పంపిణీ చేసిన ఆ సంస్థ గత ఏడాది ఆగస్టు నుంచి పంపిణీనిని ఆపేసింది. మొదటి టెండరు ద్వారా ఖరారు చేసిన ధర ప్రకారం కంటి అద్దాలను పంపిణీ చేయలేమని.. ఇతర ఏజెన్సీలకు చెల్లించిన మాదిరిగానే చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే చెల్లింపులు వెను వెంటనే జరగాలని, ఆలస్యంగా సరఫరా చేస్తే జరిమానా విధించే విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరింది. ముడిసరకులకు చెల్లించే ధరలు పెరిగాయని అందువల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆ సంస్థ చెబుతోంది.
కరోనా నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పాడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ జోన్ల వారీగా కంటి అద్దాలను.. పంపిణీ చేసేందుకు మరో రెండు సంస్థలను ఎంపిక చేసింది. ఇప్పుడు పంపిణీ 145 నుంచి 160 రూపాయల మధ్య చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆక్రితి సంస్థ కూడా ధర పెంచమని అడుగుతోంది. ఈ అంశంపై యంత్రాంగం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో కళ్లజోళ్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో అవ్వాతాతలకు నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉండగా దాదాపు 80 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది.