Krishna Ella Warning On Another Pandemic: భవిష్యత్తులో మరో మహమ్మారి పొంచి ఉందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో.. ఈసారి జంతుజాలం నుంచి విపత్తు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ - 2022కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయంలో భారతీయ వెటర్నరీ పాథాలజీ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న 39వ అంతర్జాతీయ సదస్సును డాక్టర్ కృష్ణ ఎల్ల ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి సదస్సుకు హాజరైన 450 మంది పైగా పశువైద్యులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచంలో.. ప్రత్యేకించి భారత్‌లో పశువులు, కోళ్లు, చేపలలో కలిగే వ్యాధులు, సమస్యలు, త్వరిత వ్యాధి నిర్థారణ, మానవాళికి కలిగే ఉపయోగాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు.
సాధారణంగా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే మహమ్మారులు.. విపత్తుల ప్రమాదాలను హెచ్చరిస్తూ ప్రకృతి సందేశాలు ఇస్తుందని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. కానీ, మనం అవి అర్థం చేసుకుని అప్రమత్తం కాకుండా నిర్లక్ష్యం వహిస్తుండటం వల్లే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇకనుంచైనా మానవ వైద్యులు, పశు వైద్యులు, పాథాలజిస్టులు, పరిశోధన సంస్థలు.. పూర్తి సమన్వయంతో పనిచేయడం ద్వారా భవిష్యత్తు ఎదురయ్యే సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.