ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి సోమేశ్‌ కుమార్‌.. తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు - CS Somesh Kumar should be relieved from Telangana

CS Somesh Kumar
సీఎస్ ​సోమేశ్‌ కుమార్​​

By

Published : Jan 10, 2023, 6:50 PM IST

Updated : Jan 11, 2023, 6:57 AM IST

18:46 January 10

ఈనెల 12 లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశం

CS Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సోమేశ్‌కుమార్‌ తెలంగాణ నుంచి రిలీవ్‌ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ నెల 12లోగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చేరాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ తెలంగాణ సర్కారు జీవో ఇవ్వాల్సి ఉంది. కొత్త సీఎస్‌ నియామకంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.

సీఎంతో సోమేశ్‌కుమార్‌ భేటీ.. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం సోమేశ్‌కుమార్‌ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు గంటసేపు చర్చించుకున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సీఎం ఆయనకు సూచించినట్లు తెలిసింది. అనంతరం సీఎస్‌ ప్రగతిభవన్‌ నుంచి సచివాలయానికి వచ్చి పలువురు అధికారులతో భేటీ అయ్యారు. రాత్రి 9.30 గంటలకు తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

ఆయనకు ఊహించని పరిణామం.. సీఎస్‌గా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సోమేశ్‌కుమార్‌కు మరో 11 నెలల సర్వీసు ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఆయనను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఆయన అనంతపురం కలెక్టర్‌ సహా వివిధ ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. మరో ఎనిమిది మంది సీనియర్లు ఉన్నా.. కేసీఆర్‌ 2019లో సీఎస్‌గా సోమేశ్‌నే నియమించారు.

ఏం చేయనున్నారో? సీఎస్‌ పదవి నుంచి వైదొలగాక సోమేశ్‌కుమార్‌ భవితవ్యంపై పలు అంచనాలు సాగుతున్నాయి. ఏపీలో సీఎస్‌గా నియమించే అవకాశాలు లేనందున ఆయన అక్కడికి వెళ్లరాదనే భావనతో ఉన్నట్లు తెలిసింది. డిప్యుటేషన్‌పై తెలంగాణలో ఉంచాలని ఆయన కోరడం ఒక ప్రత్యామ్నాయం. సీఎం కేసీఆర్‌ దీని కోసం లేఖ రాసినా.. ప్రస్తుత రాజకీయ విభేదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అనుమానమే. మరోచోట పనిచేయడం ఇష్టం లేని పక్షంలో సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ లేదా రాజీనామా చేసే వీలుంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వం సలహాదారుగా లేదా దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

డీజీపీపైనా చర్చ..సోమేశ్‌పై హైకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న మరికొందరు ఏపీ క్యాడర్‌ అధికారుల విషయంలో చర్చ మొదలైంది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌, ఐపీఎస్‌ అభిలాష భిస్త్‌, ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కాట ఆమ్రపాలి, ప్రశాంతి, రొనాల్డ్‌రాస్‌, వాణీ ప్రసాద్‌ తదితరులు కూడా ఏపీ కేడర్‌కు చెందిన వారే. డీవోపీటీ సోమేశ్‌కుమార్‌కు అమలు చేసిన నిబంధనలనే వర్తింపజేస్తే, వారుకూడా తక్షణం తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details