గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో దొనకొండ-గజ్జలకొండ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా ఓ ప్రకటనలో తెలిపారు. దొనకొండ-గజ్జలకొండ మధ్య 12.4 కిలోమీటర్ల డబుల్ లైన్తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు వివరించారు. ఈ మార్గాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించి 90 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు.
అందుబాటులోకి 81 కిలోమీటర్లు
ఆంధ్రా-రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయటంలో గుంటూరు-గుంతకల్ మార్గం ఎంతో కీలకం. ఈ మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణకు సంబంధించి ఇప్పటికే నల్లపాడు-సాతులూరు మధ్య 32కిలోమీటర్లు, డోన్-పెండేకల్లు మధ్య 36.6 కిలోమీటర్లు పూర్తయింది. ఇప్పుడు మరో 12.4 కిలోమీటర్లు పూర్తి కావటంతో మొత్తం 81 కిలోమీటర్లు రైలు మార్గం అందుబాటులోకి వచ్చినట్లు మల్యా వివరించారు.