National Deworming Day In Mangalagiri : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేషనల్ డీ వార్మింగ్ డే అనేది ఒక పాన్ ఇండియా లెవెల్ పబ్లిక్ హెల్త్ పోగ్రామ్ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు. ప్రజల ఆరోగ్య సమస్యలన్నీ డిజిటల్ రూపంలో భద్ర పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం చినకాకాని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు డీవార్మింగ్ మాత్రలను అందజేశారు. రాష్ట్రంలో కోటి ఏడు లక్షల మంది విద్యార్థులకు నులిపురుగు నివారణ మందులను సరఫరా చేస్తున్నామని ఆమె చెప్పారు.
ఏప్రిల్ 6 నుంచి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ : ఈ నెల 18 న మరోసారి నులిపురుగు నివారణ మందుల సరఫరా కార్యక్రమాన్ని చేపడతున్నామని విడుదల రజని అన్నారు. ఏప్రిల్ 6 న ప్రారంభించబోయే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లో ప్రజల ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలను డిజిటల్ రూపంలో భద్రం చేస్తామని, దీని వల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా అతని సమస్య వైద్యులందరికీ అందుబాటులో ఉండటంతో చికిత్స అందించడం సులభంగా ఉంటుందని ఆమె అన్నారు. మొత్తం కోటీ ఏడు లక్షల మంది విద్యార్థులకు మాత్రలు సరఫరా చేస్తున్నట్లు విడదల రజనీ వెల్లడించారు.