Temperatures in AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. సమయంతో పని లేకుండా ఎండలు దంచి కొడుతున్నాయి. వాయువ్య భారత్లోని రాజస్థాన్, గుజరాత్ల మీదుగా వేడి గాలులు అధికంగా వీస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణా మీదుగా కోస్తాంధ్ర వరకూ వేడిగాలుల ప్రభావం కొనసాగుతున్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది. వేడిగాలుల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరగటంతో నిప్పుల కొలిమిలా ఉంటున్నాయి. ఎండ ధాటికి ప్రజలు పగటి వేళల్లో బయటకు రావాడమే మానేశారు. నిత్యం అనేక వాహనాలతో రద్ధీగా ఉండే దారులు.. ఎండ తీవ్రత ఎక్కువ కావటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా అగ్గిపోయింది. తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల వల్ల ఎండలో బయటకు వెళ్తున్న ప్రజలు దాహార్తిని తీర్చుకోవటానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నగరంలో.. చలివేంద్రాల సంఖ్య తగ్గింది. దీనివల్ల ప్రజలు పదుల రూపాయలు వెచ్చించి తాగునీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. కూలీ పనులకు వెళ్తున్న దినసరి కూలీలు, ఇతర అవసరాలకు బయటకు వెళ్తున్నవారు ఎండ తీవ్రత వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.