Digvijay Singh Report On T Congress Dispute :తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాల పరిష్కారానికి దిగ్విజయ్‌సింగ్ నివేదిక సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిని ఒకట్రెండు రోజుల్లో ఆయన అధిష్ఠానానికి అందజేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పరిస్థితిని ప్రత్యేకంగా వివరించనున్నట్లు తెలుస్తోంది. దిగ్విజయ్‌సింగ్ నివేదిక ఇచ్చిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో అధిష్ఠానం సర్దుబాటు చేసేందుకు కీలక చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పీసీసీ కమిటీల ఎంపిక సహా వివిధ అంశాలపై సీనియర్లు బాహాటంగానే తీవ్ర విమర్శలు చేయడంతో.. హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జితో నాయకుల మధ్య వివాదాలు సమసిపోవడం లేదన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్ నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా సీనియర్ నాయకుడి నియామకం సహా నేతల మధ్య సయోధ్యకు.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు తప్పనిసరని అభిప్రాయపడినట్లు తెలిసింది.
నివేదికకు తుది రూపం..:దిగ్విజయ్‌సింగ్ తన నివేదికకు తుది రూపం ఇచ్చే ముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముగ్గురు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర నుంచి నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఉప ఎన్నికలు, క్యాడర్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు దిగ్విజయ్ అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. అందువల్ల పలువురు నాయకులు రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు అంచనాకు వచ్చారు.
క్షేత్రస్థాయిలో పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం: ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని నివేదించినట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయనకు బాధ్యతలు అప్పగించడం పలువురు సీనియర్లకు ఇష్టం లేదు. కానీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, సర్దుకుపోలేక సతమతమవుతూ వస్తున్నట్లు కొందరు సీనియర్లు పేర్కొన్నారు. దీంతో ఐదు అంశాలపై దిగ్విజయ్‌సింగ్ కీలక పరిష్కార ప్రతిపాదనలు ఏఐసీసీ ముందుంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
మాణికం ఠాగూర్‌పై సీనియర్ నేతల భిన్నాభిప్రాయాలు: ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌పై సీనియర్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిగా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తాము ఏమి సూచనలు చేసే పరిస్థితి లేదని దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అందరికీ భరోసా కల్పించాల్సిన ఇన్‌ఛార్జిపై.. సీనియర్లకు విశ్వాసం లేకపోవడం వల్ల పార్టీకి నష్టం కలిగిస్తుందని భావిస్తున్న దిగ్విజయ్‌సింగ్.. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించనున్నట్లు సమాచారం.
ఐక్యంగా తిప్పికొట్టాలని సూచన: బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ఐక్యంగా తిప్పికొట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సీనియర్లపై వ్యతిరేక ప్రచారం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై వారి అభిప్రాయాలు తీసుకుని పరిష్కారం చూపాలి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై సమన్వయం కోసం ఏఐసీసీ స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు లేదా.. ఏఐసీసీ నాయకుల్లో ముఖ్యులకు బాధ్యత అప్పగించడంకాని చేయాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో.. హస్తం గతి మార్చేలా.. దిగ్విజయ్‌సింగ్ నివేదిక ఇవీ చదవండి: