ఈనెల 17న కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికే ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆయన ఇంటికి వెళ్లారని..దాడి చేయటానికి కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదన్న డీఐజీ..అయినప్పటికీ కరకట్ట మొదటి భద్రత అంచె వద్దే అడ్డుకున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి ఘటనంటూ బయట జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. పూర్తి నిరాధారంగా మీడియాలో కథనాలను ప్రసారం చేశారని డీఐజీ ఆరోపించారు.
ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగిందని.. ఎమ్మెల్యే రమేశ్ కారుపైన,తర్వాత డ్రైవర్ పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేశారనంటూ డీఐజీ వీడియోలను ప్రదర్శంచారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారని...ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానమిది కాదని అన్నారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదుల మేర విచారణ జరుగుతోందని.. సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు.
జోగి రమేశ్ వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లారు, దాడికి కాదు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు సమాచారం లేదు. సమాచారం లేకున్నా జోగి రమేశ్‌ను ముందే అడ్డుకున్నాం. మాజీ సీఎం ఇంటిపై దాడి ఘటన పేరుతో ప్రచారం అవాస్తవం. ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టేందుకు కొందరు యత్నించారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు అద్దాలను రాయితో పగలగొట్టారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసి 70 మంది హడావిడి సృష్టించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిపక్ష నేతలు వచ్చే విధానమిది కాదు. ఇరుపక్షాల ఫిర్యాదులపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. -తివ్రిక్రమ్ వర్మ, డీఐజీ