ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నగరంలోని ప్రతి సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదేశించారు. సోమవారం కమిషనర్ ఛాంబర్లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై 30 ఫిర్యాదులు అందాయి. తొలుత కమిషనర్ గత వారం అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని సమీక్షించి, సోమవారం అందిన ఫిర్యాదులను ఆయా శాఖాదిపతులకు పంపి త్వరితగతిన పూర్తి చేయలని అదేశించారు.
వార్డు సచివాలయాలు స్థానిక సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలన్నారు. అందులో భాగంగా ప్రతి రోజు స్పందన కార్యక్రమం చేపట్టి ప్రజల ఫిర్యాదులు, దరఖాస్తులు తీసుకోవాలన్నారు. సదరు స్పందనలో నోడల్ అధికారులు, ఆ ప్రాంత ఇతర విభాగ అధికారులు రోజు ఒక సచివాలయంలోని కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజల నుంచి త్రాగునీరు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, సదరు సమస్యను పరిష్కరించాలని, లేకుంటే సంబంధిత సిబ్బంది పై చర్యలు తప్పవని హెచ్చరించారు.