కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో ర్యాపిడ్ విధానంలో వ్యాధి నిర్ధరణ పరీక్షలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరు నగరంలోనే 131 కేసులు ఉండగా.. నరసరావుపేట పట్టణంలో 61కి చేరుకున్నాయి. రెండు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించిన అధికారులు అక్కడ వైరస్ వ్యాప్తికి, కేసులు ఎక్కువగా నమోదు కావటానికి దారి తీసిన పరిస్థితుల్ని అధ్యయనం చేశారు.
గుంటూరులో కేసులన్నీ రెడ్ జోన్లలోనే నమోదు కాగా... నరసరావుపేటలో మాత్రం రెడ్ జోన్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఈ కారణంగా ఉన్నతాధికారులు అక్కడ పర్యటించారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే నరసరావుపేటలో రేపు, ఎల్లుండి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర సరుకుల కోసం ఇచ్చే మూడు గంటల వెసులుబాటు కూడా ఉండదని ప్రకటించారు.
మరోవైపు... రెడ్ జోన్లలో ర్యాపిడ్ విధానంలో కరోనా నిర్ధరణ పరీక్షలు ప్రారంభించారు. అక్కడ నివసించే ప్రజలందరికీ ఈ పరీక్షలు చేస్తున్నారు. తద్వారా ఎవరికైనా పాజిటివ్ ఉంటే వారిని ఆసుపత్రికి తరలిస్తారు. అందరికీ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత అక్కడ కేవలం నెగిటివ్ గా తేలిన వారు మాత్రమే బయటికి వస్తారు. పాజిటివ్ వచ్చిన వారంతా ఆసుపత్రుల్లో ఉంటారు... ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ వచ్చే వీల్లేదు కాబట్టి వైరస్ కొత్తవారికి సోకే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.