DGP attended the High Court in the contempt of court: కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే ఎంతటి వారైనా కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవలసి వస్తుందని మరోసారి రుజువు అయింది. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టు విచారణకు వచ్చారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో.. ఆయన కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన పదోన్నతి విషయంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలు ఇచ్చింది. కానీ వీటిని అమలు చేయకపోవడంతో.. సదరు ఇన్‌స్పెక్టర్ మరోసారి కోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు.. ప్రస్తుత డీజీపీతో పాటు, మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ ఛైర్మన్ కూడా కోర్టుకు రావాలని పేర్కొంది. దీంతో ప్రస్తుత డీజీపీ కోర్టు ధిక్కరణ కేసులో.. కోర్టుకు హాజరయ్యారు.
అసలు ఏం జరిగిందంటే: కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. మాజీ డీజీపీ, ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ సైతం కోర్టుకు రావాల్సి ఉండగా కేరళలో సమావేశానికి హాజరు అయినందున రాలేకపోతున్నాను అని.. అందుకు మన్నించాలని, తదుపరి విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది.