Lokesh Padha Yatra Issue: భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు వంటివి అధికార పార్టీకే పరిమితమా? ప్రతిపక్షాలకు, ప్రజాసంఘాలకు, సమస్యలపై గళమెత్తే వర్గాలకు ఆ హక్కులుండవా? టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు ఇప్పటివరకు అనుమతులివ్వలేదు సరికదా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఇప్పటివరకూ ఏ నాయకుడు పాదయాత్ర చేసినప్పుడూ అడగని రీతిలో అనేక వివరాలు కోరుతూ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు శనివారం లేఖ రాయడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు? వారి వివరాలేంటి? రాత్రుళ్లు ఎక్కడ బస చేస్తారు? ఇలా డీజీపీ అనేక యక్ష ప్రశ్నలు వేయడం, ఆ వివరాలన్నీ ఆదివారం ఉదయం 11 గంటలకల్లా తమకు అందజేయాలంటూ, శనివారం సాయంత్రం లేఖ రాయడం చూస్తుంటే.. ఏదో ఒక సాకుతో లోకేశ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించాలన్నదే పోలీసుల వ్యూహంగా కనిపిస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
విపక్షాల ముందరి కాళ్లకు బంధం వేయడానికి జీవో 1 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. అది వివాదాస్పదం కావడం, దానిపై కోర్టులో కేసు ఉండటంతో, అసాధ్యమైన వివరాల్ని పోలీసులతో అడిగించడం ద్వారా పాదయాత్రకు అనుమతివ్వరాదన్న ఎత్తుగడ వేసిందని ఆ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు.. అనుమతి తీసుకోవాలని పోలీసులు కోరినా, ఆ అవసరమే తమకు లేదని అప్పటి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బదులివ్వడం, జగన్ పాదయాత్రపై కేవలం పోలీసులకు సమాచారం మాత్రం ఇస్తూ.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి పి.కృష్ణమోహన్‌రెడ్డి అప్పటి డీజీపీకి హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయం నుంచి ఒక లేఖ రాయడాన్ని రాజకీయవర్గాలు గుర్తుచేస్తున్నాయి. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి పోలీసులకు చెప్పిన సమాధానంపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాన్ని, జగన్ వ్యక్తిగత కార్యదర్శి డీజీపీకి రాసిన లేఖను టీడీపీ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాయి.
చరిత్రలో ఎప్పుడైనా విన్నామా?:భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛ వంటి హక్కుల్ని సమానంగా కల్పిస్తే.. ఏపీ పోలీసులు మాత్రం కుదరదంటున్నారు. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశాలు, సభలు, ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కు వంటివి కేవలం అధికారపార్టీకే వర్తిస్తాయన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ల రామయ్య ఈ నెల 9నే డీజీపీకి, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. 9న ఇ-మెయిల్‌లో ఆ లేఖలు పంపారు. 10న డీజీపీ, 11న హోం శాఖ కార్యదర్శి కార్యాలయాల్లో హార్డ్ కాపీలు అందజేశారు. ఈ నెల 10న, మళ్లీ 18న పలమనేరు డీఎస్పీకి టీడీపీ లేఖలు రాసింది. కుప్పం, పూతలపట్టు, చిత్తూరు డీఎస్పీలకూ లేఖలు రాశారు. పాదయాత్ర గడువు దగ్గర పడుతున్నా పోలీసుల నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో.. అనుమతి కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ వర్ల రామయ్య శుక్రవారం మళ్లీ డీజీపీకి లేఖ రాశారు. శనివారం సాయంత్రానికి తీరికగా స్పందించిన డీజీపీ.. తామడిగిన వివరాలన్నీ ఇవ్వాలని కోరారు.
మానవమాత్రులకు సాధ్యమేనా?:లోకేశ్ 125 శాసనసభ నియోజకవర్గాల మీదుగా.. 400 రోజులపాటు, 4 వేల కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర తలపెట్టారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి. ఆ స్థాయి నాయకుడు పాదయాత్ర చేస్తుంటే.. సంఘీభావం చెప్పేందుకు టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. లోకేశ్ అనే కాదు.. ఏ పార్టీ ముఖ్య నాయకులు పాదయాత్ర చేసినా అదే స్థాయిలో హడావుడి ఉంటుంది. గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, షర్మిల, జగన్ పాదయాత్రలూ అలాగే సాగాయి. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రా అలాగే సాగుతోంది. అప్పుడెప్పుడూ లేని, దేశంలో మరెక్కడాలేని విధంగా.. ఏపీ పోలీసులే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ముఖ్య నాయకులు పాదయాత్రలు చేస్తున్నప్పుడు.. దానిలో పాల్గొనేవారు, సంఘీభావం చెప్పేవారు ఎక్కడికక్కడ మారుతూ ఉంటారు. ఆయా గ్రామాలు, నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేటప్పుడు ఎక్కడికక్కడ స్థానికులు చేరుతూ ఉంటారు. వారందరి పేర్లు, వివరాలు ముందే ఇవ్వడం సాధ్యమేనా? పాదయాత్రలో పాల్గొనే వాహనాల నంబర్లు, పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా డీజీపీ కోరారు. లోకేశ్ పాదయాత్ర 400 రోజులపాటు జరుగుతుంది. ఆయన వెంట పాదయాత్రలో పాల్గొనేందుకు ఎవరెవరు వస్తారో, ఏ వాహనాల్లో వస్తారో.. ఇప్పుడే ఊహించి ఆ వివరాల్ని ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది? డీజీపీకి ఆ విషయం తెలీదా? ఏదో ఒక సాకుతో పాదయాత్రకు అనుమతి నిరాకరించేందుకే అవన్నీ అడిగారా? అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.