గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 16వ నెంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 105 పేదల ఇళ్లను పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ అధికారులు పొక్లెయిన్లతో కూల్చేశారు. ఆక్రమిత స్థలాల్లో ఉన్న ఈ ఇళ్లను రహదారి విస్తరణలో భాగంగా తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల చర్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న తమకు.. ప్రత్యామ్నాయం చూపకుండా కట్టుబట్టలతో రోడ్డుపైకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు విస్తరణ కోసమే పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగించారని తహసీల్దారు జీవీ రామ్‌ప్రసాద్ చెప్పారు. పేదల తరఫున, పంచాయతీ తరఫున వాదనలు విని హైకోర్టు ఇచ్చిన 14 పేజీల తీర్పును సంబంధిత వ్యక్తులకు పంపామని తెలిపారు.
ఇదీ చదవండి:మే మొదటి వారంలో.. విద్యాలయాల బోధన రుసుములపై అధికారిక ప్రకటన..!
ఆక్రమణలు తొలగించారు: ఎమ్మెల్యే ఆర్కే
రహదారి విస్తరణ కోసం అధికారులు ఆక్రమణలు తొలగించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంగళగిరి కార్పొరేషన్‌గా ఏర్పడినందున రోడ్డును విస్తరించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. బలవంతంగా ఏ పేదవాడి ఇంటినీ తొలగించలేదని.. నిజమైన లబ్ధిదారులు అందరికీ న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.