గుంటూరు జిల్లా ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరిగేలా... వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ అత్యాధునిక వసతులు కల్పించింది. అంకితభావం కలిగిన ప్రసూతి వైద్యుల్ని నియమించింది. వీరు సాధారణ ప్రసవాలతో పాటు అవసరమైన వారికి సిజేరియన్ సేవలను కూడా అందిస్తున్నారు. దీంతో సర్కారీ దవాఖానాల్లో ప్రసవానికి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఒక్క తెనాలి ఆస్పత్రిలోనే నెలకు 350 నుంచి 400 వరకు కాన్పులు జరుగుతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే బాలింతలకు ఏడు రోజుల పాటు బలవర్థకమైన ఆహారం అందించాలని, వారితో పాటు శిశువులూ ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ‘ఆహార పట్టిక’ను రూపొందించింది. అది క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించింది. సర్కారీ ఆస్పత్రుల్లకు వచ్చే రోగులకే కాకుండా సహాయకులకూ ఇకపై ఆహారం అందించనున్నట్టు ప్రభుత్వం ఇటీవల స్పష్టంచేసింది. అయితే బాలింతలకే లక్ష్యం మేరకు ఆహారం అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సహాయకులకు ఆశించిన స్థాయిలో ఎలా అందిస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు (ఏపీవీవీపీ) పరిధిలో గుంటూరులో ఓ జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 15 సీహెచ్‌సీలు, ఒక పీహెచ్‌సీ ఉన్నాయి. విటిలో కాన్పులు జరుగుతున్నాయి. ప్రసవించిన తల్లులకు, వారికి తోడుగా వచ్చిన వాళ్లకు భోజనం అందటం లేదు.
బాలింతలకు ఏడు రోజుల పాటు అందజేయాల్సిన బలవర్థక ఆహారం
ఉదయం అల్పాహారం:మొదటి రోజు 100 గ్రాముల రొట్టె, 10 గ్రా. బెల్లం, 250 మిల్లీలీటర్ల పాలను అందజేయాలి. అలాగే 2, 5 రోజుల్లో మూడు ఇడ్లీలతో పాటు చట్నీ, 3, 7 రోజుల్లో కిచిడి; 4, 6 దినాల్లో టమాటోబాత్, కట్టెపొంగలి ఇవ్వాలి.
మధ్యాహ్నం:మొదటి రెండ్రోజులూ పైన చెప్పిన పరిమాణంలో రొట్టె, పాలు, బెల్లం అందజేయాలి. మూడు నుంచి ఏడో రోజు వరకు 450 గ్రా. అన్నం, 150 మి.లీ. సాంబారు, గుడ్డు, అరటిపండు, ఓ కప్పు పెరుగుతో పాటు ఆకుకూర పప్పు, సోయాబీన్ కూర ఇవ్వాల్సి ఉంటుంది.
సాయంత్రం:ఏడు రోజులూ 150 మి.లీ. రాగిమాల్ట్, చెరో మూడ్రోజులు పప్పుఉండ, సీజనల్ కాయలు ఇవ్వాలి. ఇక 6 నుంచి 8 గంటల్లోపు వారం రోజులూ 450 గ్రా. అన్నం, 150 మి.లీ. సాంబారు, ఒక గ్లాసు మజ్జిగ, కాయగూరలతో తయారుచేసిన కూరల్ని అందజేయాలి.