ఆలస్యమైన నైరుతి రుతుపవనాల రాక Delayed Southwest Monsoon in AP: ఖరీఫ్ ప్రారంభమై మూడు వారాలు కావొస్తున్నా పొలాలు పదును కాలేదు. పొలాల్లో విత్తనాలు పడలేదు. చిరుజల్లులు పడితే రైతులు అరకలు దున్ని పొలం సిద్ధం చేసుకుందామనుకున్నా.. వాన జాడ కరవైంది. నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట, పుట్టపర్తి ప్రాంతాలకు తాకి వారం దాటున్నా.. అక్కడి నుంచి ముందుకు కదలటం లేదు. తొలకరి వెనక్కి చూస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
రోహిణి కార్తె పోయి మృగశిర వచ్చిన కూడా.. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం కూడా 46 డిగ్రీలుగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని అధిక ప్రాంతాలు తీవ్ర వడగాలులతో ఉడికిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు కురిసినా.. సాగుకు అనకూలించే స్థాయిలో పడలేదు. తొలకరి వెనక్కి చూస్తుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. జూన్‌లో ఆదివారం వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 77 శాతం తక్కువ వర్షం కురిసింది. పంటలసాగు 49 శాతం తగ్గింది. నీటి వసతి ఉన్నచోట కొద్దిపాటి విస్తీర్ణంలో పంటలు వేశారు.
అప్పుడు జోరు వానలు: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు ముంచెత్తాయి. మిరప, మొక్కజొన్న, పసుపు, మామిడి, బొప్పాయి, అరటి రైతులను నిండా ముంచాయి. తీరా తొలకరి మొదలయ్యేనాటికి ముఖం చాటేశాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోకా తుపాను దీనికి ఒక కారణం. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్‌జాయ్ తుపాను కూడా రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపాయి. ఈ నెల 11న శ్రీహరికోట దగ్గర రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు.. 18వ తేదీ వరకు అక్కడే ఉన్నాయి. వచ్చే 2, 3 రోజుల్లో ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితితులున్నాయని.. వాతావరణ విభాగం సూచిస్తోంది. తర్వాత రాష్ట్రమంతా విస్తరించేందుకు మరికొన్ని రోజులు పడుతుంది.
రాష్ట్రంలో మే నెల వరకు పరిశీలిస్తే ఒక్కటంటే ఒక్క జిల్లాలోనూ వర్షాలు అనుకూలించలేదు. అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో 80 శాతం నుంచి 94 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. తొలకరి జల్లులు జూన్‌లో పడితే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తారు. రాయలసీమలో వేరుసెనగ, కోస్తాలో పత్తి పంటతోపాటు తొలకరిలో నువ్వులు ఇతర పంటలను సాగుచేస్తారు. ఈ ఏడాది వానలు లేకపోవడంతో పంటలు వేయలేదు. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 49 శాతం తక్కువగా పంటలు సాగయ్యాయి.
ఈ నెల 14 నాటికి మొత్తం 1.37 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా... అందులో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాగాణి సాగు 66 వేల ఎకరాల్లో ఉంది. కేవలం 33 వేల ఎకరాల్లో వేరుసెనగ వేశారు. బోర్లు, బావులు, కాలువలు వంటి నీటి వసతి ఉన్నచోట వేరుసెనగ, పత్తి పంటలు వేశారు. వానలు ఆలస్యమైనందువల్ల తొలకరి సాగు కూడా తగ్గే అవకాశం ఉంది. కోస్తా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిస్తే నువ్వులు, కంది పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేస్తారు. ఇప్పటికీ వర్షం లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.