కొవిడ్ బాధితులతో రద్దీ, పరీక్షలు, ఆస్పత్రిలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తుండే రోగులు, పడకలు దొరక్క ఆరుబయటే అవస్థలు, గుంటూరు జీజీహెచ్‌లో నిత్యం కనిపించే దృశ్యాలివి. స్వల్ప లక్షణాలున్న వారూ ఆస్పత్రుల్లో చేరితే.. వాస్తవానికి ఆక్సిజన్ అవసరమయ్యే వారికి బెడ్ దొరకని పరిస్థితి. వైద్యపరీక్షలు, ఆస్పత్రిలో ప్రవేశానికి సరైన ప్రణాళిక లేక రోగులు అవస్థలు పడేవారు. సమస్యను గుర్తించిన జిల్లా యంత్రాంగం.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. జీజీహెచ్ పక్కనే ఉన్న ఏసీ కళాశాలలో కొవిడ్ ఓపీ కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. అక్కడే అసెంబ్లీ హాలులో 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
కొవిడ్ అనుమానిత లక్షణాలున్న వారికి ఓపీ కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించి బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంటే ఐసోలేషన్ చేసి మందులు ఇస్తారు. బాధితుని పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే అక్కడే పడక కేటాయిస్తారు. పరిస్థితి సీరియస్ అయితే పక్కనే ఉన్న జీజీహెచ్‌కు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల కరోనా పరీక్షలు నిర్ణీత సమయంలో చేయడానికి సాధ్యమవుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న వేళ.. కరోనా రోగుల ఒత్తిడి తగ్గించేలా ఈ ప్రత్యామ్నాయ చర్యలు ఫలితాలిస్తాయని అధికారులు భావిస్తున్నారు.