గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రమాదకర రహదారి విస్తరణ.. కాగితాలకే పరిమితమవుతోంది. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. మారని రహదారి దుస్థితిని చూసి ప్రజలు నిట్టూరుస్తున్నారు.
అసలేంటి సమస్య?
గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి కొండమోడు మధ్య 25 కిలోమీటర్ల మేరన ఉన్న కీలక రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఏటా ప్రమాదాలు పెరుగుతున్నా.. రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. సత్తెనపల్లి మండలం నందిగామ నుంచి ధూళిపాళ్ల వరకు ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వెళ్లాలంటే గుంటూరు నుంచి పేరేచర్ల వరకు... పిడుగురాళ్ల నుంచి నార్కెట్ పల్లి వరకు సాఫీగా ప్రయాణం సాగుతోంది. మధ్యలోని పేరేచర్ల నుంచి రాజుపాలెం మండలం కొండమోడు వరకు ఉన్న 25 కిలోమీటర్ల రహదారి మాత్రం నరకం చూపిస్తోంది. ప్రమాదాలతో నెత్తురోడుతోంది.
కారణాలు.. పర్యవసానాలు
నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ కీలక మార్గం వెడల్పు 5.5 మీటర్లే. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానికితోడు మూడు నెలలుగా కురిసిన వర్షాలకు రహదారి ఇరువైపులా దెబ్బతింది. రాజుపాలెం నుంచి కొండమోడు వరకు పరిస్థితి దారుణంగా ఉంది. ఏటా మరమ్మతుల నిర్వహణతో సరిపెడుతున్నారు. రద్దీ పెరిగి ట్రాఫిక్ స్తంభించడం నిత్యకృత్యంగా మారింది. సత్తెనపల్లి పట్టణంలో ట్రాఫిక్‌పై తీవ్రప్రభావం పడుతుంది. వర్షాకాలమైతే వెన్నాదేవి, ధూళిపాళ్ల వద్ద వాగులు పొంగుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తరచూ అవాంతరాలతో ప్రయాణ సమయం బాగా పెరిగిపోతుందని ప్రయాణికులు నిట్టూర్చడమూ సాధారణమైపోయింది. ఎంత అనుభమున్న డ్రైవరైనా అత్యంత అప్రమత్తంగా వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.